మాన‌వ‌త్వం చాటిన వైసీపీ లేడీ ఎమ్మెల్యే

Update: 2019-09-23 04:55 GMT
గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే డాక్ట‌ర్ ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి మాన‌వ‌త్వం చాటుకున్నారు. రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న‌ ఇద్ద‌రికి స్వ‌యంగా ప్రథ‌మ చికిత్స అందించి.. ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. స్వ‌యంగా వైద్యురాలు అయిన శ్రీ‌దేవి స్పందించిన తీరుపై ఇప్పుడు స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. ఆ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సోమ‌వారం ఉదయం సాక్షి ఛానెల్ లైవ్ షో ముగించుకొని ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి విజయవాడ నుంచి తిరిగి గుంటూరు వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

విజ‌య‌వాడ నుంచి గుంటూరుకు ఎమ్మెల్యే శ్రీ‌దేవి బ‌య‌లుదేరారు. ఇదే సమయంలో పెదకాకాని వద్ద అనుకోకుండా అటుగా వస్తున్న బైక్ టైర్ పగలడంతో వెనుక నుంచి వస్తున్న కారు ఆ బైకుని ఢీ కొట్టింది.  తీవ్ర రక్తస్రావంలో కొట్టుమిట్టాడుతున్న వారిని గమనించిన ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి వెంట‌నే స్పందించారు. తన కాన్వాయ్ ని ఆపేసి పరుగులు పెట్టుకుంటూ ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్నారు. స్టెత‌స్కోప్‌ తో గాయ‌ప‌డిన వారిని ప‌రీక్షించారు. అప్ప‌టికే వ‌చ్చి ఉన్న అంబులెన్స్‌ లోకి ఒక‌రికి ఎక్కించి.. స్వ‌యంగా ఇంజెక్ష‌న్ చేసి - ప్ర‌థ‌మ చికిత్స  అందించారు. ఆ త‌ర్వాత వారిని ద‌వాఖాన‌కు త‌ర‌లించారు.

రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారికి వైద్య‌సేవ‌లు అందించిన ఎమ్మెల్యే శ్రీ‌దేవిపై ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. నిజానికి.. ఎమ్మెల్యే శ్రీ‌దేవి.. మంచి గుర్తింపు పొందిన డాక్ట‌ర్‌. హైద‌రాబాద్‌ లో ఆమె ఫేమ‌స్ గైన‌కాల‌జిస్ట్‌. ఆమె భ‌ర్త కూడా నెఫ్రాల‌జిస్ట్‌ గా ప‌ని చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు వైసీపీలో చేరారు. తొలి ప్ర‌య‌త్నంలోనే తాడికొండ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. అంతేగాకుండా.. రాజ‌కీయాల్లో చాలా ముక్కుసూటిగా కుండ‌బ‌ద్ధ‌లుకొట్టిన‌ట్టు మాట్లాడారు. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ.. వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తూ.. త‌న మార్క్ రాజ‌కీయాన్ని చూపిస్తున్నారు.


Full View
Tags:    

Similar News