ఒక్క జగన్ ఒంటరి జగన్ ఏం చేస్తారు అనుకుంటే పదేళ్లు తిరిగేసరికల్లా తాను కోరుకున్న సీఎం కుర్చీని పట్టేశారు. ఒక్కరుగా నిలిచి గెలిచారు. పక్కన 150 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు వచ్చి చేరవచ్చు కానీ 2024 ఎన్నికల్లోనే మళ్లీ జగన్ ఒక్కడుగా జనంలోకి వెళ్తున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలు తాను గెలిపించిన ఎమ్మెల్యేలు, తాను ఎంపిక చేసుకున్న మంత్రులు, తన ఎంపీలు, తన పార్టీ నేతలు ఇంతమందితో మందీ మార్బలం ఉన్నా కూడా జగన్ డైరెక్ట్ ఫైట్ కి దిగిపోతున్నారు.
ప్రత్యర్ధి పార్టీలను అన్నీ కలిపి ఒకేసారి చాకిరేవు పెట్టేస్తున్నారు. తానే కౌంటర్లు వేస్తున్నారు. సెటైర్లు వేస్తున్నారు. ఎంతకైనా నేను రెడీ అంటున్నారు. ఇది నిజంగా ఆశ్చర్యమే. జగన్ ఎందుకు ఇంత తొందరపడుతున్నారు. ఎందుకు ఇంత దూకుడు పెంచుతున్నారు అంటే ఆసక్తికరమైన విశ్లేషణలే వస్తున్నాయి. తాను గెలిపించిన ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉంటున్నారు అన్న ఆలోచన ఉండి ఉండాలి. లేదా వారు ఇస్తున్న కౌంటర్లు సరిపోవడం లేదు అన్న డౌట్లు ఉండాలి.
అంతకు మించి వారి విమర్శలను జనాలు నమ్మడంలేదు అన్న భావన కూడా ఉండాలి. ఏమైతేనేమి విపక్షాలకు కాషాయం మింగించాలనుకుంటే తాను అనుకున్న డోస్ పార్టీ జనాలు ఇవ్వడం లేదని గట్టిగా డిసైడ్ అయ్యారో ఏమో కానీ జగనే ముగ్గులోకి వచ్చేశారు. ఒక సీఎం గా ఉంటూ ఆయనే ఎన్నికల రాజకీయానికి తెర తీశారు.
ఇంకా ఏణ్ణర్ధం పైగా అధికారం చేతిలో ఉంది. నిజానికి విపక్షాలు అయితే ఇప్పటి నుంచే జనంలో ఉండాలి. తాము ఎక్కడ వెనకబడిపోతామో అని సర్దుకోవాలి. కానీ జగన్ మాత్రం వారి కంటే ముందు పరిగెడుతున్నారు. వారి కంటే ముందు తన ఎమ్మెల్యేలను గడప గడపకు పంపుతున్నరు. వారి నుంచి సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఎవరి పనితీరు బాగా ఉండదో వారికి టికెట్ ఇవ్వనని చెప్పేస్తున్నారు.
అలా వారికి టార్గెట్ పెడుతూనే తాను విపక్షాల మీదకు విల్లూ బాణం పట్టుకుని సిద్ధమైపోతున్నారు. నిన్న నరసావుపేట, నేడు నరసన్నపేట. ఎక్కడ అయినా జగన్ హీట్ అసలు తగ్గించడంలేదు. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ణి పట్టుకుని కంబైండ్ గానే అటాక్ చేస్తున్నారు. టీడీపీ జనసేన ఏమీ చేయలేవని చెబుతున్నారు. తాను ఎంతో చేశాను తననే జనాలు ఎన్నుకోవాలి అని జనాలను కోరుకుంటున్నారు.
టీడీపీ వారి ప్రోగ్రాం ఇదేమి ఖర్మను జగన్ ఇపుడు హైజాక్ చేశారు. వారు ఇంకా డిసెంబర్ నుంచి మొదలెట్టాలి. కానీ అంతకంటే ముందే జగన్ ఇదేమి ఖర్మరా బాబూ అంటూ టీడీపీని పొలిటికల్ ర్యాంగింగ్ చేసి పారేస్తున్నారు. ఇలా ఆదికి ముందే తాను ఫీల్డ్ లోకి దిగి అటాక్ స్టార్ట్ చేయకపోతే విపక్షం పుంజుకున్నాక ఎన్ని కౌంటర్లేసినా ఫలితం ఉండదని జగన్ భావిస్తున్నట్లుగా ఉంది.
ఇంకో వైపు జగన్ సభలలో బారికేడ్లు పెట్టి గట్టి బందోబస్తును పోలీసులు చేస్తున్నారు. జగన్ నర్సారావుపేట సభకు నల్ల దుస్తులు చున్నీలు వేసుకున్న వారిని దూరం పెట్టారని విమర్శలు వచ్చాయి. ఇలా ఎన్ని విమర్శలు వచ్చినా తన సభ జరిగే ప్రాంతంలో షాపులు ఇతర దుకాణాలు మూసివేయించినా జగన్ పట్టించుకోవడంలేదు.
తన సభ సాఫీగా సాగాలి. నల్ల జెండాలతో ఎవరూ నిరసన చేయకూడదు, ఏ రాయో రప్పో సభలో విసిరినా సమాధానం చెప్పుకోవడం కష్టమవుతుంది అని భావించే జగన్ ఇలా చేస్తున్నారు అని కూడా చర్చ సాగుతోంది. మొత్తానికి తనదైన ఎన్నికల వ్యూహానికి తెర తీసిన జగన్ విపక్షాలను ఏకి పారేస్తున్నారు. ఈ నేపధ్యంలో తన భద్రతకు సంబంధించి పోలీసులు అతి చేస్తున్నా ఆయన అంతా తన మంచికే అని భావిస్తున్నారు.
సో జగ్న మార్క్ సభలు ఇవి. ఆయన మార్క్ కౌంటర్లు కూడా ఇవి. దీనికి విపక్షం ఏ విధంగా రియాక్ట్ అయినా ఆయనకు ఓకే. కానీ తన పని తాను చేసుకుంటూ ప్రతిపక్షం కంటే ముందు ఉండాలనుకుంటున్నారు. ఈ వ్యూహంతో ఆయన విపక్షం మీద పై చేయి సాధిస్తారా.. చూడాలి మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.