జేసీ బ్ర‌ద‌ర్స్ అల్లుడ‌ని నిరూపించుకున్న దీప‌క్ రెడ్డి!

Update: 2017-04-01 08:28 GMT
ఏపీలో ఇటీవ‌లే ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో భాగంగా స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన టీడీపీ యువ నేత దీప‌క్ రెడ్డి గుర్తున్నారుగా. నెల్లూరు జిల్లా వాస్త‌వ్యుడైన‌ప్ప‌టికీ... తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి అల్లుడిగానే రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేసిన దీప‌క్ రెడ్ది... త‌న సొంత జిల్లా నుంచి కాకుండా మామ గారి జిల్లా అయిన అనంత‌పురం జిల్లా నుంచే ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యే దాకా దీప‌క్ రెడ్డిపై పెద్ద‌గా ఆరోప‌ణ‌లేమీ వినిపించ‌లేదు. అదేం ముహూర్త‌మో గానీ... దీప‌క్ రెడ్డి ఎమ్మెల్సీగా నామినేష‌న్ వేసిన ద‌గ్గ‌ర నుంచే ఆయ‌న చుట్టూ వివాదాలు రేగాయి. మామ జేసీ మాదిరే దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంలో దీప‌క్ రెడ్డి ఇంచు కూడా త‌గ్గ‌ర‌ట‌. ఇక అల్లుడిని యునినామస్‌ గా మండ‌లికి పంపేందుకు రంగంలోకి దిగిన జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి... బ‌రిలో నిలిచిన సీపీఎం నేత‌ల‌ను బెదిరించి మ‌రీ నామినేష‌న్‌ ను విత్ డ్రా చేయించార‌న్న ఆరోప‌ణ‌లు కూడా వినిపించాయి.

ఏదైతేనేం... ఎమ్మెల్సీగా ఏక‌గ్రీవంగానే ఎన్నికైన దీప‌క్ రెడ్డి... ఆ వెనువెంట‌నే ఓ భూక‌బ్జా కేసులో ఇరుక్కున్నారు. హైద‌రాబాదులో స్నేహితుల‌తో వ్యాపారం వెల‌గ‌బెట్టిన దీప‌క్ రెడ్డి.... న‌కిలీ ప‌త్రాలు సృష్టించి విలువైన భూముల‌ను క‌బ్జా చేసేశార‌ట‌. ఈ విష‌యంపై బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న హైద‌రాబాదు సీసీఎస్ పోలీసులు దీప‌క్ రెడ్డి స‌హా ఆయ‌న మిత్రబృందంపై కేసులు న‌మోదు చేసింది. ఈ కేసు న‌మోదైన ద‌గ్గ‌ర‌నుంచి అడ్రెస్ లేకుండా పోయిన దీప‌క్ రెడ్డి... నిన్నటిదాకా ఎక్క‌డున్నారో కూడా తెలియ‌దు. ఎమ్మెల్సీగా గెలిచిన దీప‌క్ రెడ్డి... ప్ర‌మాణ స్వీకారం చేయ‌కుండా ఎంతోకాలం ఉండ‌లేరుగా. ఈ క్ర‌మంలో త‌న‌ను అరెస్ట్ చేయ‌కుండా ఉండేలా... కోర్టు నుంచి ముంద‌స్తు బెయిల్ చేజిక్కించుకున్న దీప‌క్ రెడ్డి నిన్న సీసీఎస్ పోలీస్ స్టేష‌న్ ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. అనుచ‌రుల‌ను వెంటేసుకుని మ‌రీ వ‌చ్చిన దీప‌క్ రెడ్డి.. బెయిల్ ప‌త్రాల‌ను పోలీసుల‌కు అంద‌జేసి తిరుగు ప‌య‌న‌మయ్యారు.

ఈలోగా దీనిపై స‌మాచారం అందుకున్న సాక్షి ప‌త్రిక ఫొటోగ్రాఫ‌ర్‌... అక్క‌డికి చేరుకుని పోలీస్ స్టేష‌న్ నుంచి వెళుతున్న దీప‌క్ రెడ్డిని ఫొటో తీయ‌బోయార‌ట‌. దీంతో ఒక్క‌సారిగా ఆగ్ర‌హావేశానికి గురైన దీప‌క్‌... త‌న మామ ప్ర‌భాక‌ర్ రెడ్డి మాదిరే ఫొటోగ్రాఫ‌ర్‌పై విరుచుకుప‌డ్డార‌ట‌. బూతులు తిడుతూ ఫొటోగ్రాఫ‌ర్ చేతిలోని కెమెరా లాక్కుని... అందులోని చిప్‌ను లాగేసుకున్నార‌ట‌. ఈ సంద‌ర్భంగా ఈ త‌ర‌హా దౌర్జ‌న్య‌మేమీ బాగాలేద‌న్న స‌ద‌రు ఫొటోగ్రాఫర్‌ తో... ఏం చేసుకుంటావ్‌?.. అయితే ఇంకో కేసు అవుతుంది. ఇప్ప‌టికే ఓ కేసు అయ్యింది. నీవు కేసు పెడితే ఇంకొక‌టి మాత్ర‌మే పెరుగుతుంది* అంటూ త‌న‌దైన శైలిలో చెప్పేసి అక్క‌డి నుంచి వెళ్లిపోయార‌ట‌. ఇక దీప‌క్ రెడ్డి స్పీడ్ చూసిన ఆయ‌న అనుచ‌రులు కూడా ఫొటోగ్రాఫ‌ర్‌పై బూతుల వ‌ర్షం కురిపించ‌డ‌మే కాకుండా అత‌డిని తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేశార‌ట‌. ఎంతైనా... జేసీ బ్ర‌ద‌ర్స్‌ కు అల్లుడు క‌దా... అందుకేనేమో మామ‌కు త‌గ్గ‌ట్లే దీప‌క్ రెడ్డి కూడా త‌న‌దైన రీతిలో బెదిరింపుల‌కు పాల్ప‌డ్డార‌ని బాధితుడు ఆగ్ర‌హం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా దీప‌క్ రెడ్డిపై పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేశాడ‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News