పట్టపగలు.. అందరూ చూస్తుండగానే ఆ పార్టీ నేతను దారుణంగా చంపేశారు

Update: 2021-09-11 04:11 GMT
తమిళనాడులో దారుణ హత్య చోటు చేసుకుంది. పట్టపగలు..నడి రోడ్డు మీద అందరూ చూస్తున్న వేళ చోటు చేసుకున్న ఈ దారుణ హత్య సంచలనంగా మారింది. ఎంఎన్ఎంకే పార్టీ ముఖ్యనేతను కత్తులతో నరికేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన సదరు నేత.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ దారుణ ఉదంతానికి సంబంధించి బయటకు వస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడులోని వెల్లూరు జిల్లా వాణియంబాడిలోని జీవ నగర్ నివాసి ఎంఎన్ఎంకే పార్టీకి చెందిన నేత వసీం అక్రమ్. ఆ పార్టీలో కీలక నేతగా ఆయనకు పేరుంది. అయితే.. తాను ఉండే ప్రాంతంలో గంజాయి గ్యాంగ్ ల ఆగడాలు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి. వారిపై పోరాటం చేస్తున్నాడు వసీం అక్రమ్. దీంతో.. గంజా గ్యాంగ్ కు చెందిన ఇంతియాజ్ కు.. అక్రమ్ కు కొంతకాలంగా విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. శుక్రవారం ఇంటి నుంచి బైక్ మీద బయటకు వచ్చాడు వసీం అక్రమ్.

అతడి కోసమే కారులో మాటు వేసిన కొందరు గుర్తు తెలియని దుండగులు అతనిపై విరుచుకుపడ్డారు. ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. అతడిపై కత్తులతో నరికేశారు. దాదాపు ఐదుగురు వరకు ఈ దాడిలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన అక్రం.. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ మరణించాడు.

ఈ ఘటనతో ఉలిక్కిపడిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సమీపంలోని సీసీ కెమేరా ఫుటేజ్ ఆధారంగా హత్యకు పాల్పడిన నిందితుల్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. విభేదాల నేపథ్యంలో ఇంతియాజ్ కు చెందిన వారే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలింపు మొదలు పెట్టారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
Tags:    

Similar News