డిఫెన్స్ లో మోడీ, అమిత్ షా.. యడ్డీ రె‘ఢీ’

Update: 2021-07-26 06:30 GMT
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. యడ్డీ విషయంలో బీజేపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఆచితూచీ అడుగులు వేస్తోంది. కర్ణాటక సీఎం బీఎస్ యడ్యూరప్పను ఖచ్చితంగా మార్చుతారని జోరుగా ఊహాగానాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయంలో నిర్ణయం తీసుకునే విషయంలో అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారని అంటున్నారు.

కర్ణాటక సీఎం యడ్యూరప్పకు 75 ఏళ్లు దాటడం.. ఆయనపై పలు ఆరోపణలు రావడంతో పదవి నుంచి దిగిపోవాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.   75 ఏళ్లు నిండిన ప్రస్తు కర్ణాటక సీఎం యడ్యూరప్పకు ఉద్వాసన తప్పదని కొన్నిరోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు.. ఐటీ పార్కుల కోసం కేటాయించిన భూమిని గృహ అవసరాల కోసం యడ్యూరప్ప మళ్లించారని అవినీతి ఆరోపణలు చుట్టుమట్టాయి. దీనిపై లోకాయుక్త కూడా విచారణ జరుపుతోంది. దీనిపై హైకోర్టులో సవాల్ చేసిన యడ్డీకి చుక్కెదురైంది. దీంతో కొత్త సీఎంను బీజేపీ అధిష్టానం నియమించనుందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా వచ్చే ఎన్నికల వరకు యడ్డీనే సీఎంగా బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో కన్నడనాట చెలరేగిన రాజకీయ తుఫాన్ చల్లారినట్టైంది.

నిజానికి ఈ ఆదివారమే యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారని జోరుగా ప్రచారం సాగింది. ‘నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. ఉండమంటే ఉంటా.. పొమ్మంటే పోతాను.. నా బ్యాగ్ రెడీగా ఉందని’ యడ్యూరప్ప ఇప్పటికే తేల్చిచెప్పారు.

అయితే బలమైన యడ్యూరప్పను తప్పిస్తే కర్ణాటకలో బీజేపీ పరిస్థితి ఏమిటీ.. బీజేపీ పూర్తి కాలం అధికారంలో ఉంటుందా? ఉండదా? అని కొందరు బీజేపీ పెద్దలు అయోమయంలో ఉన్నారు. కర్ణాటక రాజకీయాల్లో తమకంటూ ముద్ర వేసుకున్న స్వామీజీలు ఏకంగా 500 మందికిపైగా యడ్యూరప్పకే మద్దతిస్తూ బెంగళూరు ప్యాలెస్ మైదానంలో బలప్రదర్శన చేయడంతో బీజేపీ హైకమాండ్ చివరి నిమిషంలో యడ్యూరప్పను తొలగించే కార్యక్రమాన్ని పక్కనపెట్టింది.

ఇప్పటికే సీఎం యడ్యూరప్ప రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ నుంచి తనకు ఎప్పుడైనా ఫోన్ రావచ్చని.. రాజానామా తాను చేయొచ్చని సీఎం మీడియాముందే తేల్చిచెప్పేశాడు.  ఆ గడువు దగ్గరపడడంతో ఇప్పుడు కర్ణాటకలో ఏం జరుగుతుందనేది సస్పెన్స్ థ్రిల్లర్ గా మారింది.

కర్ణాటకలో సీఎం మార్పుపై మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. ప్రస్తుతం హైకమాండ్ పెద్దలు దీని గురించి తీవ్ర అయోమయంలో ఉన్నారని తెలుస్తోంది. సీఎం మార్పు తర్వాత జరగబోయే పరిణామాలను కూడా ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు లెక్కలు వేసుకొని అంచనాలు వేస్తున్నారని సమాచారం.

ఇక తాను సీఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని.. ఉండమంటే ఉంటా.. పోమ్మంటే పోతా.. నా బ్యాగ్ రెడీగా ఉందంటూ యడ్యూరప్ప ఇప్పటికే బీజేపీ హైకమాండ్ కు తేల్చిచెప్పారని సమాచారం. సీఎంగా కొనసాగిస్తే తన పని తాను చేసుకుంటూ వెళతానని.. రాజీనామా చేయమంటే నిమిషం కూడా వేరే విషయంలో ఆలోచించకుండా సీఎం పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని యడ్యూరప్ప కుండ బద్దలు కొట్టినట్టు సమాచారం.

 అయితే కర్ణాటక రాజకీయాలు గంటగంటకు మారుతూ టెన్షన్ కు గురిచేస్తున్నాయి. బీజేపీ కార్యకర్తలు, కన్నడిగులతోపాటు దేశవ్యాప్తంగా రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారు కూడా కర్ణాటక రాజకీయాల మీద ఫోకస్ చేశారు. యడ్యూరప్పను తప్పిస్తే కర్నాటకలో బీజేపీ సర్కార్ కూలుతుందన్న భయం బీజేపీ పెద్దలను వెంటాడుతోంది. సీఎం మారిపోతే ఆపరేషన్ కమలాతో బీజేపీలోకి జంప్ అయిన కొందరు ఎమ్మెల్యేలు మళ్లీ కాంగ్రెస్ లోకి జంప్ అయ్యే పరిస్థితి ఉందని తెలుస్తోంది. దీంతో యడ్యూరప్పను మార్చాలని చూసిన అధిష్టానం ఇప్పుడు పునరాలోచనలో పడినట్టుగా సమాచారం.

మొత్తం మీద కర్ణాటకలో యడ్యూరప్ప మార్పుతో అక్కడ ప్రభుత్వం కూలడం ఖాయమన్న ప్రచారం బీజేపీ పెద్లలను కలవరపరుస్తోంది. యడ్డీతోపాటు బీజేపీ కార్యకర్తలు సైతం ఇప్పుడు ఈ మార్పుపై ఆందోళన చెందుతున్నారు.
Tags:    

Similar News