చంద్రబాబుకి కేసీఆర్, మోడీ బర్త్ డే విసెష్

Update: 2017-04-20 07:49 GMT
68వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి పలువురు ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖ శాంతులతో జీవించాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. ఈ మేరకు ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ, రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు మరిన్ని సేవలను అందించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ కూడా చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.
    
చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో ఆత్మీయత కనబరుస్తూ కేసీఆర్ పంపిన శుభాకాంక్షలు చంద్రబాబుకు సంతోషం కలిగించాయి. చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ పంపిన శుభాకాంక్షలను అందుకున్న చంద్రబాబు, ఆయనకు తిరిగి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతకాలం గడిచినా, తెలుగు ప్రజలు ఒకటిగా కలిసుండాలని తాను కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు.
    
కాగా  హైదరాబాద్ లో బాబు జన్మదినం సందర్భంగా జరిగిన వేడుకలకు తెలుగుదేశం నేతలు ఎల్ రమణ, రావుల, మోత్కుపల్లి, పెద్దిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రక్తదాన శిబిరంలో కార్యకర్తలు రక్తదానం చేశారు. మరోవైపు ఏపీలోనూ చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో భారీ ఎత్తున సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. కార్యకర్తలు తమ నాయకుడి జన్మదిన వేడుకులను ఘనంగా జరుపుతున్నారు. చంద్రబాబును కలిసి స్వయంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలతో ఆయన నివాసం కళకళలాడుతోంది. చదలవాడ కృష్ణమూర్తి, కొల్లు రవీంద్ర, సండ్ర వెంకటవీరయ్య, యరపతినేని శ్రీనివాసరావు, టీటీడీ ఈఓ సాంబశివరావు తదితరులు ఆయన నివాసానికి వచ్చారు.  ఉదయం కాసేపు ప్రముఖుల నుంచి అభినందనలు అందుకున్న చంద్రబాబు, ఆపై అనంతపురం పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News