మోడీ బ‌ర్త్ డే వేడుక‌లు 20 రోజులు , బీజేపీ సిద్ధాంతాల‌కే విరుద్ధ‌మా?

Update: 2021-09-05 07:30 GMT
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ పుట్టిన రోజును దేశ వ్యాప్తంగా 20 రోజుల పాటు వేడుక‌గా నిర్వ‌హించాల‌ని బీజేపీ ప్ర‌ణాళిక‌లు రెడీ చేస్తోంది. ఇందు కోసం అనేక ర‌క‌ర‌కాల ఉత్స‌వాల‌ను, కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాల‌ని బీజేపీ భావిస్తోంది. ఈ విష‌యంలో బీజేపీ జాతీయాధ్య‌క్షుడు న‌డ్డా స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ట‌, సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌డంతో పాటు.. మోడీ విజ‌యాల‌ను కూడా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేలా పుట్టిన రోజు వేడుక‌ల‌ను ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఏకంగా 20 రోజుల పాటు ఈ కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌నే వార్త ఆస‌క్తిదాయకంగా మారింది.

వేరే రాజ‌కీయ పార్టీల నేత‌ల‌కు సంబంధించి ఇలాంటి వేడుక‌లు పెద్ద విడ్డూరం కాదు. ఆ పార్టీల్లో వ్య‌క్తిస్వామ్యం ఎక్కువ‌. అయితే తమది వ్య‌క్తిస్వామ్యం కాదంటూ బీజేపీ చెబుతూ ఉంటుంది. వ్య‌క్తి పూజ త‌మ వ‌ద్ద ఉండ‌ద‌ని బీజేపీ నేత‌లు ఇప్ప‌టికీ బాహాటంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. గ‌తంలో దేశంలో వ్య‌క్తి పూజ వ‌ల్ల‌నే అన‌ర్థాలు జ‌రిగాయ‌ని బీజేపీ నేత‌లు అంటూ ఉంటారు. ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితులు కూడా కేవ‌లం కొంత మంది వ్య‌క్తుల వ‌ల్ల వ‌చ్చాయ‌ని, వ్య‌క్తుల‌ను చూసి ఓటేస్తే, వ్య‌క్తి స్వామ్యం వ‌ల్ల అలాంటి ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయ‌ని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు కూడా.

మ‌రి ఇప్పుడు బీజేపీ వాళ్లు మోడీ పుట్టిన రోజును భారీ ఎత్తున నిర్వ‌హించాల‌ని, 20 రోజుల పాటు ఏకధాటిగా ఉత్స‌వాల‌ను నిర్వ‌హించాల‌నే ప్ర‌ణాళిక‌లు వేస్తూ ఉండ‌టం బీజేపీ సిద్ధాంతాల‌కు ఇవి స‌బ‌బైన‌వేనా? అనే చ‌ర్చ‌కు కూడా తెర లేస్తోంది.  

బీజేపీ నేప‌థ్యానికి త‌గ్గ‌ట్టుగా ఏ ఆవిర్భావ దినోత్స‌వాల‌నో, మ‌రో సంద‌ర్భాల్లో ఇలా గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసి ఉంటే అదో లెక్క‌. అయితే ప్ర‌ధాని పుట్టిన రోజును ఇలా ఇర‌వై రోజుల పాటు నిర్వ‌హించాల‌న‌డం వ్య‌క్తి పూజ‌కు నిద‌ర్శ‌న‌మే అవుతుంది! గ‌తంలో కాంగ్రెస్ ను ఇలాంటి విష‌యాల్లోనే బీజేపీ వాళ్లు బాగా విమ‌ర్శించే వాళ్లు. వార‌స‌త్వ రాజ‌కీయాలు, వ్య‌క్విస్వామ్యాలు అంటూ  విమ‌ర్శించే వాళ్లు. ఇప్పుడు బీజేపీనే ఇలాంటి విష‌యాల్లో వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సిన ప‌రిస్థితుల్లోకి ప‌డుతున్న‌ట్టుగా ఉంది!
Tags:    

Similar News