మోడీ ఫ్రీ స్కీం వర్కవుట్ అవుతుందా?

Update: 2015-12-30 07:50 GMT
అభివృద్ధి - దీర్ఘకాలిక ప్రగతి వంటి నిర్మాణాత్మక అభివృద్ది లక్ష్యాలతో వెళ్తున్న మోడీ ఇంతవరకు ఓ కీలకాంశాన్ని మర్చిపోయారు. దీర్ఘకాలిక లక్ష్యాలు - నిర్మాణాత్మక ప్రణాళికలతో దేశానికి మంచి జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదనప్పటికీ ఓటర్లను ఆకర్షించడంలో మాత్రం అవి పెద్దగా ఉపయోగపడవని చరిత్రలో ఎన్నోసార్లు నిరూపణ అయింది. ప్రజాదరణ పొందాలంటే ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి కలిగే పథకాలు అమలు చేయాల్సిందే. దేశంలో ఇంతవరకు వివిధ రాష్ట్రాల్లో ఎందరో ముఖ్యమంత్రులు అలాంటి పథకాలతో ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉండిపోయిన సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్టీ రామారావు - వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి సీఎంలు అలాంటి పథకాలతో ప్రజల్తో చెరగని ముద్రవేసుకుని ప్రజలు మెచ్చిన పాలకులుగా నిలిచిపోయారు. ఎన్టీరామారావు రూ.2 కిలోబియ్యం ప్రతి ఒక్కరి ఆకలిని తీరిస్తే రాజశేఖరరెడ్డి ఆరోగ్య శ్రీ పథకం ఎందరినో పెద్దపెద్ద జబ్బుల నుంచి పైసా ఖర్చు లేకుండా బతికించింది. వాటివల్ల లబ్ధి పొందినవారంతా ఇప్పటికీ వారిని దేముళ్లుగా చూస్తుంటారు. ఇప్పుడు మోడీ కూడా ఆ స్థాయిలో కాకపోయినా ప్రజలపై ఎక్కువగా భారంపడే అంశాలను గుర్తించి అలాంటి సేవలను ఉచితంగా అందించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఈ కొత్త సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు.  కేంద్రంలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చినా ఆ తరువాత వరుస దెబ్బలు తింటుండడంతో మోడీ రూటు మార్చినట్లుగా కనిపిస్తోంది.

ప్రస్తుత కాలంలో ఎంత చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా రోగ నిర్ధారణ కోసం ఎన్నో పరీక్షలు చేస్తున్నారు. పరీక్షలకయ్యే ఖర్చు ఒక్కోసారి వైద్యం కంటే ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో ఉచిత వైద్య పరీక్షలు అందుబాటులోకి తెస్తే దేశంలో కోట్లాది మందిపై భారం తగ్గుతుంది. ఇది పక్కాగా అన్ని రాష్ట్రాల్లో అమలయ్యేలా చూడగలిగితే మోడీకి మంచి ఆదరణ తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ అభివృద్ది ప్రణాళికలతో వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.... తన ప్రణాళికల ఫలితాలు వచ్చేలోగా ప్రజల కోసం మంచి పథకం ఒకటి తేగలిగే ఆయన ఆదరణా మరింత పెరగడం ఖాయం.
Tags:    

Similar News