భోపాల్ గ్యాస్ లీక్ పరిహారంపై మోడీ సర్కారుకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Update: 2023-03-14 16:26 GMT
కేంద్రంలోని మోడీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో తాజాగా దాఖలు చేసిన కీలక పిటిషన్ లో కేంద్రం చేసిన వాదనను సుప్రీం తోసిపుచ్చుతూ నిర్ణయం తీసుకుంది. 1984 భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో యూనియన్ కార్బైడ్ కంపెనీ నుంచి అదనపు పరిహారం కోరుతూ కేంద్రం పిటిషన్ దాఖలు చేయటం.. దీనిపై విచారణ జరిపిన సుప్రీం.. ఆ పిటిషన్ ను తోసిపుచ్చుతూ నిర్ణయం తీసుకుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 1984 డిసెంబరు మూడున భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ఇండియా ఫ్లాంట్ నుంచి మిథైల్ ఐసో సైనేట్ అనే విషపూరిత వాయువు లీక్ కావటం.. ఆ దుర్ఘటన బారిన పడి.. అప్పటికప్పుడు మూడు వేల మంది మరణించిన భయంకర విషాదం చోటు చేసుకోవటం తెలిసిందే. ప్రపంచంలో అతి పెద్ద పారిశ్రామిక విపత్తుగా పేర్కొనే ఈ ఉదంతంలో దాదాపు లక్షకు పైగా ప్రజలు తీవ్ర ప్రభావానికి గురయ్యారు. అయితే.. ఈ వ్యవహారంలో బాధితులకు అందాల్సిన పరిహారం సరైన రీతిలో అందలేదన్న వాదనను కేంద్రం తాజాగా తెర మీదకు తీసుకొచ్చింది.

ఈ కేసును మళ్లీ రీఓపెన్ చేయాలని.. యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ యాజమాన్యం నుంచి అదనపు పరిహారం చెల్లించేందుకు ఆదేశించాలని కోరుతూ క్యూరేటివ్ పిటిషన్ ను దాఖలు చేశారు. 1989లో జరిగిన సెటిల్ మెంట్ లో వాస్తవ నష్టాన్ని సరిగా అంచనా వేయలేదన్నది కేంద్రం తాజా వాదన. దీనిపై ఐదుగురు సభ్యులు ఉన్న సుప్రీంధర్మాసనం తోసిపుచ్చుతూ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రెండు దశాబ్దాల తర్వాత ఈ అంశాన్ని కేంద్రం లెవనత్తడంలో హేతుబద్దత లేదని స్పష్టం చేసింది.

పెండింగ్ లో ఉన్న నష్టపరిహారం క్లెయిమ్స్ కోసం రిజర్వు బ్యాంక్ ఇండియా వద్ద ఉన్న రూ.50 కోట్లను వినియోగించాలని ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. భోపాల్ ఎపిసోడ్ లో కాంగ్రెస్ సరైన రీతిలో రియాక్టు కాలేదన్న విమర్శలకు బలం చేకూరేలా చేయటం ద్వారా మోడీ సర్కారు రాజకీయ ప్రయోజనాన్ని ఆశించే ఈ పిటిషన్ ను దాఖలు చేసిందన్న వాదన ఉంది. ఇలాంటి వేళ.. సుప్రీం నుంచి కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలేలా నిర్ణయం వెలువడటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News