మోడీ సాహ‌స షోతో డ్యామేజ్ త‌ప్ప‌దా?

Update: 2019-07-30 04:30 GMT
చిన్నా.. పెద్ద అన్న తేడా లేకుండా అన్ని మీడియా సంస్థ‌లు.. దిన‌ప‌త్రిక‌లు ఇవాల్టి బ్యాన‌ర్ వార్త ఒకేలా ఉండ‌టం గ‌మ‌నించొచ్చు. మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్ షోకు సంబంధించిన టీజ‌ర్ నిన్న (సోమ‌వారం) సాయంత్రం విడుద‌ల కావ‌టం.. అప్ప‌టిక‌ప్పుడు ఆ అంశం వివాదంగా మార‌ట‌మే కాదు.. ప్ర‌ధాని బాధ్య‌తారాహిత్యాన్ని గుర్తుకు తెచ్చు అంశాలు ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. జాతి మొత్తం విషాదంలో మునిగిపోతే మోడీ మాత్రం షూటింగ్ హ‌డావుడిలో ఉన్నార‌న్న మ‌చ్చ వేశారు. ఇందులో నిజం ఎంత‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ఈ సాహ‌స‌యాత్ర‌కు సంబంధించిన టీజ‌ర్ ప్ర‌ధాని మోడీ ఇమేజ్ ను పెంచ‌టం తర్వాత డ్యామేజ్ చేయ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. ఈ షోకు సంబంధించిన షూటింగ్ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 14న జ‌రిగింది. అదే రోజు మ‌ధ్యాహ్నం క‌శ్మీర్ లోని పుల్వామాలో ఉగ్ర‌వాదులు ఆత్మాహుతికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌లో 40 మంది సీఆర్ పీఎఫ్ జ‌వాన్లు మ‌ర‌ణించారు. ఈ విష‌యం ప్ర‌ధాని దృష్టికి వెళ్లిన‌ప్ప‌టికి ఆయ‌న షూటింగ్ లో బిజీగా గ‌డిపిన‌ట్లుగా విమ‌ర్శ‌లు ఉన్నాయి.

పుల్వామా ఘ‌ట‌న మ‌ధ్యాహ్నం చోటు చేసుకుంటే ప్ర‌ధాని మోడీ రాత్రికి స్పందించార‌ని కాంగ్రెస్ ప్ర‌తినిధి ర‌ణ‌దీప్ సూర్జేవాలా అదే రోజు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో మండిప‌డ్డారు. తాజా టీజ‌ర్ తో నాటి విష‌యాలు ఇప్పుడు తెర మీద‌కు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఉత్త‌రాఖండ్ లోని మారుమూల ప్రాంతంలో షూటింగ్ జ‌రిగిన నేప‌థ్యంలో పుల్వామా ఉదంతంపై మోడీకి స‌మాచారం లేద‌న్న వాద‌న కూడా ఉంది.

అయితే.. ఈ వ్య‌వ‌హారంలో మోడీ త‌ప్పు లేద‌ని.. ఆయ‌నకు అత్యంత స‌న్నిహితుడు.. జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ డోభాల్ దేన‌న్న వార్త‌ల్ని కొన్ని జాతీయ ఛాన‌ళ్లు ప్ర‌సారం చేశాయి కూడా. అయితే.. ఆ విమ‌ర్శ‌ల‌కు.. వాద‌న‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త ల‌భించ‌లేదు. కాకుంటే.. తాజాగా విడుద‌లైన టీజ‌ర్ తో నాటి అంశాల్ని ఇప్పుడు తెర మీద‌కు వ‌చ్చాయి.

ప్రోమో చూడండి.. మోడీ ఎంత నిర్ల‌క్ష్యంగా.. ఏమీ ప‌ట్ట‌న‌ట్లు న‌వ్వుతున్నారో?  ఓ వైపు జ‌వాన్ల కుటుంబాలు శోక‌సంద్రంలో ఉంటే.. ఆయ‌న ఎంజాయ్ చేస్తూ గ‌డిపారంటూ విమ‌ర్శ‌లు విరుచుకుప‌డుతున్నాయి. మోడీ మీద విమ‌ర్శ‌ల బాణాల్ని గురి పెట్టిన మోడీ అండ్ కోకు ఇప్పుడు ఇబ్బందిక‌రంగా మార‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మోడీ మీద విరుచుకుప‌డేందుకు మంచి అవ‌కాశం కోసం చూస్తున్న పీడీపీ అధ్య‌క్షురాలు మెహ‌బూబా ముఫ్తీ సైతం వెటకారంగా స్పందించారు. క్రియేటివ్ పీఆర్ విధానాన్ని మోడీ అనుస‌రిస్తుంటార‌ని.. ఆయ‌న స‌మ‌యాన్ని అస్స‌లు ప‌ట్టించుకోరంటూ త‌ప్పు ప‌ట్టారు. ప్రోమోలో మోడీని చూసుకొని ఆయ‌న అభిమానులు మురిసిపోతుంటే.. ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు మాత్రం మండిప‌డుతున్నారు. ఆగ‌స్టు 12న టెలికాస్ట్ అయ్యే ఈ ఎపిసోడ్.. రానున్న రోజుల్లో మ‌రింత రాజ‌కీయ దుమారాన్ని రేపే అవ‌కాశం ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News