మోడీ మ్యానియా స‌రే.. దీనికి స‌మాధానం ఏంటి?

Update: 2022-12-09 04:04 GMT
దేశంలో మోడీ మ్యానియా జోరుగా ఉంద‌ని..మీడియా ప్ర‌చారం ఊపందుకుంది. ఇంకేముంది.. మోడీ ఈ దేశానికి దిక్సూచి అని.. ఆయ‌న హ‌యాంలో దేశంలో అనేక సంచ‌లనాలు జ‌రుగుతున్నాయ‌ని పెద్ద ఎత్తున బాకాలు బాగానే ఊదుతున్నారు. దీనికి కార‌ణం.. గుజ‌రాత్‌లో 7వ సారి బీజేపీ అధికారంలోకి రావ‌డ‌మే. స‌రే.. ఈ విజ‌యాన్ని త‌ప్ప‌కుండా మోడీ ఖాతాలోనే వేద్దాం.. ఆయ‌న‌కు తిరుగులేద‌ని ఒప్పుకొందాం.

అయితే, అదేస‌మ‌యంలో దేశంలో మ‌రొక‌రాష్ట్రం హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోనూ ఎన్నిక‌లు జ‌రిగాయి. అంతేనా కాదు.. ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ  స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. అదేవిధంగా అత్యంత కీల‌క‌మైన, బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలోని ఒక పార్ల‌మెంటు స్థానానికి కూడా ఉప ఎన్నిక జ‌రిగింది. మ‌రి అక్క‌డ మోడీ స‌త్తా ఏంటి?  ఆయ‌న మ్యానియా అక్కడ ఎలా ప‌నిచేసింది. పోనీ.. ఉప ఎన్నిక‌లే క‌దా.. అంటారా?

కానీ, ఉప ఎన్నిక‌ల‌ను కూడా బీజేపీ నాయ‌కులు  సార్వ‌త్రిక స‌మ‌రాన్ని మించి పోరాడారు. కేంద్ర మంత్రుల‌ను కూడా మోహ‌రించి యూపీలోని మెయిన్‌పురి(ములాయం సింగ్ మ‌ర‌ణంతో జ‌రిగిన పోలింగ్‌) నియోజ‌క‌వ‌ర్గంలో క‌లియ దిరిగారు. చ‌నిపోయిన నాయ‌కుడిపైనా.. అవినీతి ఆరోప‌ణ‌లు చేశారు. కుటుంబ రాజ‌కీయం అన్నారు. మోడీ వ‌ల్లే యూపీ అభివృద్ధి అన్నారు. మ‌రి ఇంత చేసినా.. ఇక్క‌డ బీజేపీకి డిపాజిట్లు ద‌క్క‌లేదు. మ‌రి దీనిని ఎలా చూడాలి. ఇది మోడీ మ్యానియా అని ఎలా చెప్ప‌గ‌లం.

అస‌లు దేశంలో ఏం జ‌రిగింది?

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ చేతిలో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. 68 స్థానాలున్న అసెంబ్లీలో కేవ‌లం 20కే క‌మ‌ల నాథులు ప‌రిమితం అయ్యారు. ఇక్క‌డ ప్ర‌ధాని మోడీ విస్తృతంగా ప్ర‌చారం చేశారు. అంతేకాదు, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా సొంత రాష్ట్రం. అంతేనా, కేంద్ర‌మంత్రి అనురాగ్ సింగ్‌కు కూడా ఇది సొంత రాష్ట్ర‌మే. మ‌రి ఇక్క‌డ మోడీ మ్యానియా ఏమైంది.

రాజస్థాన్  అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో బీజేపీ ప‌రాజ‌యం పాలైంది.  ఛత్తిస్ ఘడ్ ఉప ఎన్నికల్లోనూ ఇదే ప‌రిస్థితి. ఇక్క‌డ‌ కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకుంది. ఒడిశా అసెంబ్లీసీటుకు జ‌రిగిన‌ ఉప ఎన్నికల్లో అధికార న‌వీన్ ప‌ట్నాయక్ బీజేపీని ఓడించారు.  బీహార్  అసెంబ్లీ సీటుకు జ‌రిగిన ఉప ఎన్నికల్లో నితీష్ కుమార్‌ చేతిలో ఓడిపోయింది. ఉత్తర్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో MP, రెండు MLA సీట్ల‌ను బీజేపీ గెలుచుకోలేక‌పోయింది. ఇక‌, కీల‌క‌మైన‌ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లోAAP చేతిలో బీజేపీ ప‌రాజ‌యం పాలైంది. అంటే.. మొత్తంగా చూస్తే.. గుజ‌రాత్ మిన‌హా.. ఎక్క‌డా మోడీ మ్యానియా క‌నిపించ‌లేద‌నేది నిష్టుర‌స‌త్యం! ఇప్పుడు ప‌ల‌కండి.. మోడీకి జేజేలు!!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News