ముందున్న పెను స‌వాళ్లు: ‌కేంద్రం ఏం చ‌ర్య‌లు తీసుకోబోతోంది?

Update: 2020-06-24 13:00 GMT
ఒక‌వైపు వైర‌స్ విజృంభ‌ణ‌.. మ‌రోవైపు స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌లు.. రెచ్చిపోతున్న చైనా.. నేపాల్‌.. ఇటువైపు ఉగ్ర‌వాదుల దాడులు.. ఇంకోవైపు లాక్‌డౌన్‌తో ఏర్ప‌డిన క‌ష్టాలు.. వీట‌న్నిటి నేప‌థ్యంలో కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం బుధ‌వారం జ‌రిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంత్రివ‌ర్గ స‌మావేశం లోక కల్యాణ్ మార్గ్-7లోని ప్ర‌ధాని నివాసంలో జ‌రిగింది. ఈ భేటీకి కీలక శాఖల మంత్రులు హాజరయ్యారు. సుదీర్ఘంగా ఈ స‌మావేశం కొన‌సాగింది. దేశంలోని ప‌రిస్థితులు.. తాజాగా ఏర్ప‌డిన ప‌రిణామాలు.. వైర‌స్ క‌ట్ట‌డి.. ప్ర‌జ‌ల‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌డం వంటి అంశాల‌పై తీవ్ర చ‌ర్చ సాగిన‌ట్లు స‌మాచారం.

వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు తగ్గేలా సైన్యాలను ఉపసంహరించుకుందామన్న ప్రతిపాదనకు చైనా అంగీక‌రించ‌క‌పోవ‌డం.. భారత్‌పై నేపాల్‌తో పాటు చైనా విషం కక్కే పని ఉండ‌డం.. సరిహద్దులో ఉద్రిక్త‌త‌లు ప్ర‌ధాన చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. లాక్ డౌన్‌తో ఆర్థిక వ్య‌వ‌స్థ గాడీన పడకపోవడం వంటి వాటిపై చ‌ర్చ సాగింది.

దేశంలో పెను సవాళ్లు ఉన్నాయి.. వాటిని ఎలా ఎదుర్కొనాల‌నే విష‌య‌మై మంత్రుల‌తో ప్ర‌ధాని చ‌ర్చ సాగిన‌ట్లు ప్ర‌ధాన మీడియాలో చ‌ర్చ న‌డుస్తోంది. లాక్‌డౌన్ కారణంగా కోట్లాది మంది వలస కూలీలు మహానగరాలను వదిలేసి సొంత ఊళ్లకు వెళ్లిపోయిన నేపథ్యంలో ఉపాధి హామీ పథకం ద్వారా వాళ్లందరికీ పని కల్పించాలని కేంద్రం భావించింది. లాక్‌డౌన్ ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు కోల్పోయిన వారికి తిరిగి అవ‌కాశాలు క‌ల్పించేలా నిర్ణ‌యాలు తీసుకోనున్న‌ట్లు చ‌ర్చ న‌డుస్తోంది. దీనిలో భాగంగా ఉపాధి హామీ పథకానికి మ‌రిన్ని నిధులు చెల్లించి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవ‌కాశాలు పెంచే యోచ‌న‌లో ఉంది.

ఇక ప్ర‌స్తుతం వ్యవసాయ సీజ‌న్ ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో రైతుల‌కు కావాల్సిన సౌక‌ర్యాలు వంటివి క‌ల్పించేలా.. గ‌తంలో రూపొందించిన ప‌థ‌కాల అమ‌లుపై చ‌ర్చ సాగింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఉద్దీపనలు ప్రకటించే అవ‌కాశాలు ఉన్నాయి. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం నుంచి మెరుగైన సహకారం అందించేలా ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి.

వైరస్ వ్యాప్తి కట్టడిపై కూడా ప్ర‌ధాన చ‌ర్చ సాగిన‌ట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్.. అన్‌లాక్ వంటి విష‌యాలు రాష్ట్రాలకే వదిలేసినా ప్ర‌స్తుతం వైర‌స్ వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకోవాలా వ‌ద్దా అనేది చ‌ర్చ‌కు వ‌చ్చింది. మ‌ళ్లీ దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ ఉండదని గ‌తంలోనే ప్ర‌ధాని ప్ర‌క‌టించారు. కాక‌పోతే వైర‌స్ నివార‌ణ‌కు కృషి చేస్తూనే అన్‌లాక్ 2.0 విధించే యోచ‌న‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఉంది. స‌రిహ‌ద్దులో గుంట‌న‌క్క‌లా వేచి ఉండి కయ్యానికి కాలు దువ్వుతోన్న చైనాకు బుద్ధి చెప్పేలా కేంద్ర నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల అన్ని రాజ‌కీయ పార్టీలు, ముఖ్య‌మంత్రుల స‌మావేశంలో చ‌ర్చించిన అంశాలు.. తీసుకున్న నిర్ణ‌యాలు ఈ స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఈ విధంగా ప‌లు కీల‌క విష‌యాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంది. ఆ నిర్ణ‌యాల‌ను అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.
Tags:    

Similar News