బీజేపీలో మోడీ మార్కు గేమ్‌

Update: 2015-09-01 16:11 GMT
భార‌తీయ జ‌న‌తాపార్టీలో విభేదాలు ముదిరాయా? కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ తో ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోడీ తృప్తిగా లేరా? హోంశాఖ మంత్రికి తెలియకుండానే హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మెహరిషి నియామించడం వెనక మతలబేంటి? ఆర్థిక శాఖ కార్యదర్శిగా రిటైర్‌ కానున్న రాజీవ్‌ మెహరిషిని ఉన్నట్టుండి హోంశాఖ కార్యదర్శిగా కేంద్రం ఎందుకు ప్రమోషన్‌ ఇచ్చింది?ఈ అంశాల‌న్నీ ఇపుడు జాతీయ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. వెర‌సీ కేంద్ర ప్ర‌భుత్వంలో లుక‌లుక‌లు ఉన్నాయంటూ వార్త‌లు వెలువ‌డుతున్నాయి.

1978 ఐఎఎస్‌ బ్యాచ్‌ కు చెందిన రాజీవ్ మెహరిషి ఆర్థిక కార్యదర్శిగా విధులు నిర్వహించారు. అయితే ఆయన పదవికాలం సోమవారంతోనే ముగియడంతో రాజీవ్‌ సహచరులు వీడ్కోలు సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలోనే కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మెహరిషి నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంతో అందరూ కంగు తిన్నారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు.

హోంశాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఎల్సీ గోయల్ వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేయగా కేంద్రం ఆమోదం కూడా తెలిపింది. వాస్తవానికి గోయల్‌ పనితీరుపట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ అసంతృప్తిగా ఉండడమే ఇందుకు కారణం. వివాదంలో ఉన్న‌ సన్‌ టీవికి 37 చానళ్లకు హోంమంత్రిత్వ శాఖ పచ్చజెండా ఊపడం జైట్లీ కి నచ్చలేదు. ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు కూడా.. ఎందుకంటే సన్‌ టీవీపై మనీలాండరింగ్‌, అవినీతికి సంబంధించిన మూడు కేసులపై విచారణ జరుగుతోంది. అలాగే నాగాలాండ్‌ తో ఒప్పందంపై ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం అసంతృప్తిగా ఉంది. సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ వ్యవహారంలో తాత్కాలిక విచారణకు హోంశాఖ కార్యదర్శి  గోయ‌ల్ నిరాకరించారు. ఇవ‌న్నీ కూడా కార‌ణ‌మ‌ని తెలుస్తొంది.

అయితే హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మెహరిషి నియామకంపై ఆ శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ కు మాటవరసకైనా ప్ర‌ధాన‌మంత్రి చెప్పకపోవడం బీజేపీలో ముదురుతున్న విభేదాలను సూచిస్తోందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజ్‌ నాథ్‌ సింగ్‌ ను దృష్టిలో పెట్టుకునే ఎల్‌ సి గోయల్‌ ని తప్పించినట్టు తెలుస్తోంది. ఈ నియామకంతో అరుణ్‌ జైట్లీ, రాజ్‌ నాథ్‌ సింగ్‌ ల మధ్య ఉన్న పాత విభేదాలను గుర్తుకు తెస్తోందని చెబుతున్నారు.
Tags:    

Similar News