వెనుకంజ‌లో మోడీ..రాహుల్.. ప‌వ‌న్!

Update: 2019-05-23 04:12 GMT
తుది ఫ‌లితం ఎలా ఉంటుంద‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. కౌంటింగ్ స్టార్ట్ అయిన గంట త‌ర్వాత ఒకే స‌మ‌యంలో ఆశ్చ‌ర్య‌క‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. పోస్ట‌ల్ బ్యాలెట్ తో పాటు.. మొద‌టి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయిన త‌ర్వాత‌.. ప‌లువురు ప్ర‌ముఖులు వెనుకంజ‌లో ఉండేలా ఫ‌లితాలు వెలుగు చూడ‌టం విశేషం. దేశ వ్యాప్తంగా త‌న గాలి వీసేలా చేసిన మోడీ మేజిక్.. వార‌ణాసిలో ప‌ని చేసిన‌ట్లుగా క‌నిపించ‌లేదు. తుది ఫ‌లితం ఎలా ఉన్నా.. ప్ర‌స్తుతానికి మాత్రం ఆయ‌న వెనుకంజ‌లో ఉండ‌టం ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో మోడీ పేరు మంత్రంగా మారి.. ఓట్లు వేయ‌గా.. స్వ‌యంగా ఆయ‌న బ‌రిలో ఉన్న వార‌ణాసిలో కౌంటింగ్ ఆరంభంలో మోడీ వెనుకంజ‌లో ఉండ‌టం విశేషం. అయితే.. త‌ర్వాతి రౌండ్ల‌లో ఆయ‌న పుంజుకోవ‌టం ఖాయ‌మ‌నే చెబుతున్నారు. ఒక రౌండ్ లో వెనుకంజ‌లో ఉన్నా.. ఉన్న‌ట్లే. ఎందుకంటే.. ఆయ‌న మోడీ అన్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ త‌న మాతృస్థానంగా చెప్పే అమేధీలో వెనుకంజ‌లో ఉన్నారు. 2014 ఎన్నిక‌ల్లోనూ కొద్ది రౌండ్లు వెనుకంజ‌లో ఉండి.. ఆ త‌ర్వాత ఆయ‌న పుంజుకొని గెల‌వ‌టం తెలిసిందే. తాజాగా అలాంటి ప‌రిస్థితే ఉంటుందా?  సంచ‌ల‌న ఫ‌లితం న‌మోదు అవుతుందో చూడాలి. ఇక‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆయ‌న పోటీ చేసిన రెండు స్థానాలు.. అమ‌లాపురం.. గాజువాక రెండింటిలోనూ ఇప్ప‌టివ‌ర‌కూ వెనుకంజ‌లోనే ఉన్నారు.

వీరేకాక‌.. దౌవెగౌడ‌.. షీలాదీక్షిత్‌.. మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే.. జ‌య‌ప్ర‌ద.. అశోక్ గ‌జ‌ప‌తి రాజు.. మీసా భార‌తి.. క‌న్న‌య్య కుమార్.. గౌత‌మ్‌ గంభీర్.. సినీ న‌టి ఉర్మిళ‌.. డింపుల్ యాద‌వ్‌..  త‌దిత‌ర ప్ర‌ముఖులు వెనుకంజ‌లో ఉన్నారు. వీరిలో కొంద‌రైనా త‌ర్వాతి రౌండ్ల‌లో అధిక్య‌త‌లో ఉంటారేమో చూడాలి.
Tags:    

Similar News