విప‌క్షాల పోరాటంపై మోడీ మార్క్ సెటైర్‌

Update: 2019-01-20 04:58 GMT
బీజేపీకి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో బీజేపీయేతర పక్షాలన్నీ కోల్‌కతా వేదికగా సమరశంఖం పూరించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఆ పార్టీలపై ఎదురుదాడికి దిగారు. ఈ మహాకూటమి మోడీ వ్యతిరేక కూటమి కాదని, ప్రజా వ్యతిరేక కూటమి అని విమర్శించారు. దాద్రా నగర్ హవేలీ రాజధాని సిల్వస్సాలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. సొంత రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేసిన వారే ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని మమతా బెనర్జీపై మోడీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బీజేపీ తలపెట్టిన రథయాత్రకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సంద‌ర్భంగా విప‌క్షాల కూట‌మిని మోడీ ఎద్దేవా చేశారు. ``అవినీతికి వ్యతిరేకంగా నేను చేపట్టిన చర్యలు కొంతమందికి ఆగ్రహం కలిగించాయి. ప్రజా ధనాన్ని దోచుకోకుండా నిరోధించాను కాబట్టి వారికి కోపం రావడం సహజమే. ఇప్పుడు వారంతా మహాకూటమి పేరుతో ఏకమయ్యారు` అని మోడీ విమర్శించారు. ఒకరినొకరు కాపాడుకునేందుకు విపక్ష పార్టీలన్నీ యత్నిస్తున్నాయన్నారు. కూటమి ఇంకా ఏర్పడక ముందే భాగస్వామ్య పక్ష నేతలంతా అప్పుడే ఎవరెవరికి ఏమేమి కావాలో బేరాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. బెంగాల్‌ లో ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్న పార్టీ (బీజేపీ) అధికార పార్టీని నిద్రపోనివ్వడం లేదని... కేవలం ఒక్క ఎమ్మెల్యే ఉన్నప్ప‌టికీ....త‌మ‌ను తలుచుకుంటూ వారంతా బచావో.. బచావో అని కేకలు పెడుతున్నారని మోడీ ఎద్దేవా చేశారు.

కాగా, ఈ స‌మావేశంపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూఢీ మాట్లాడుతూ విపక్షాల ఐక్యతా సభను వ్యక్తిగత ప్రయోజనాల, విరుద్ధ సిద్ధాంతాల వేదిక అని విమర్శించారు. దేశంలో మళ్లీ తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది మోడీకి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమం... ఈ కూటమికి నాయకుడు ఎవరు? అని  ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా సభకు హాజరవడంపై స్పందిస్తూ.. కొంతమంది బీజేపీ స్టాంప్ కొనసాగిస్తారని, అదే సమయంలో అవకాశవాదంతో వ్యవహరిస్తారని విమర్శించారు.



Full View
Tags:    

Similar News