మోడీ ప్ర‌పంచ బాధ‌లు చెప్పారంటే.. మ‌న‌ల్ని బాదేస్తున్న‌ర‌న్న మాటే.. నెటిజ‌న్ల టాక్‌!

Update: 2023-01-13 13:30 GMT
కొన్ని కొన్ని విష‌యాలు చాలా గ‌మ్మ‌త్తుగా ఉంటాయి. పొరుగింటి కాంతం కాసుల పేరు చేయించుకుంద‌ని మ‌నింటావిడ అన్న‌ద‌నుకోండి.. అంత‌రార్థం ఏంటో ప‌తుల‌కు అర్ధంకాకుండా పోతుందా!! త‌న‌కు కూడా చేయించ‌మ‌నే క‌దా!! ఇక‌, రాజ‌కీయ నేత‌లు కూడా అంతే. మ‌రీ ముఖ్యంగా ప్ర‌పంచ మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నాన‌ని ప‌దే ప‌దే చెబుతున్న ప్ర‌ధాని నేంద్ర మోడీ.. ఏదైనా వ్యాఖ్యానించారంటే..దానిలో అంత రార్థం చాలా లోతుగా ఉంటుంది.

ఇక‌, తాజాగా ఆయ‌న ప్ర‌పంచ బాధ‌లు చెప్పుకొచ్చారు. ప్రపంచమంతా సంక్షోభంలో ఉన్నదని, ఎప్పటికి అనిశ్చితి నుంచి బయటపడుతుందనేది చెప్పలేమని ప్రధాని మోడీ అన్నారు.

ప్రస్తుత సమస్యలు అభివృద్ధి చెందుతున్న దేశాలు సృష్టించినవి కాకపోయినా, వాటివల్ల తలెత్తే ఇబ్బందులను మాత్రం అవే ఎక్కువగా మోస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తాను కల్పించని పరిస్థితులు, వ్యవస్థల వలయం నుంచి ఈ దేశాలు తప్పించుకోవాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు.

అయితే.. ఇలా మోడీ ఎప్పుడు ప్ర‌పంచ స‌మ‌స్య‌లు ఏక‌రువు పెట్టినా.. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఆయ‌న ఏదో ఒక రూపంలో ప్ర‌జ‌ల‌ను బాదేసిన సంద‌ర్భాలు క‌నిపిస్తాయి. గ‌త బడ్జెట్ కు ముందు కూడా.. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ఒక సంద‌ర్భంలో మాట్లాడుతూ.. మ‌నం చాలా క‌ష్టాల్లో ఉన్నామ‌ని చెప్పారు. అంతే.. ఆ త‌ర్వాత బ‌డ్జెట్‌లో ప‌న్నుల బాదుడు మోగిపోయింది. పైగా ఆదాయ ప‌న్ను ప‌రిమితి ఊసేలేకుండా పోయింది.

నిజానికి గ‌తంలో యూపీఏ(కాంగ్రెస్‌) ప్ర‌భుత్వంలో నేరుగా అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ చెప్పేసేవారు. ''కొన్ని భారాలు త‌ప్ప‌వు.. అంద‌రూ క‌లిసి భ‌రించాలి'' అనేసి.. త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల‌ను మాన‌సికంగా సిద్ధం చేసేవారు.

కానీ, ప్ర‌స్తుత ప్ర‌ధాని మోడీ మాత్రం.. ప్ర‌పంచ బాధ‌లు చెప్పి.. త‌ర్వాత‌.. త‌న బాధ‌ను అర్ధం చేసుకోమ‌న్న‌ట్టుగా.. వాటి రిఫ్లెక్ష‌న్స్ అన్నీ కూడా బ‌డ్జెట్‌లో చూపిస్తారు. త్వ‌ర‌లోనే కేంద్రం బ‌డ్జెట్ ప్ర‌క‌టించ‌నున్న నేప‌థ్యంలో మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి ఏ రూపంలో ఏత ర‌హాలో ప్ర‌జ‌ల‌ను బాదేస్తారో కానీ.. మ‌న‌మైతే.. రెడీ అయిపోవ‌లసిందే!!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News