రూ.6వేల‌తో అన్ని మాట‌లా మోడీ..?

Update: 2019-02-04 04:36 GMT
పావ‌లా ప‌ని చేసి ప‌ది రూపాయిల ప‌ని చేసిన‌ట్లుగా బిల్డ‌ప్ ఇవ్వ‌టం కొంద‌రికి అల‌వాటు. ఈ విష‌యంలో ప్ర‌ధాని మోడీ మాస్ట‌ర్ డిగ్రీ చేశార‌ని చెప్పాలి. పిల్ల‌ల‌కు ప‌ప్పు బెల్లాల మాదిరి (కేసీఆర్ రైతుబంధుతో పోల్చిన‌ప్పుడు) ఐదు ఎక‌రాల లోపు వారికి ఏడాదికి రూ.6వేల చొప్పున కొత్త ప‌థ‌కాన్ని బ‌డ్జెట్ లో ప్ర‌వేశ పెట్టిన మోడీ త‌న ఆనందాన్ని అస్స‌లు ఆపుకోలేక‌పోతున్నారు. త‌న‌లాంటి కార‌ణ‌జ‌న్ముడి కార‌ణంగానే దేశం ఇలా ఉంది కానీ.. లేకుంటే ఏమైపోయేదో అన్న‌ట్లుగా ఆయ‌న మాట‌లు ఉన్నాయి.

రైతుల‌కు ఆరు వేల రూపాయిల సాయం అందిస్తున్న వైనాన్ని ఆయ‌న క‌థ‌లు..క‌థ‌లుగా చెబుతున్నారు. త‌న మాదిరి ఆలోచించే బుర్ర దేశంలో మ‌రే నేత‌కు లేద‌న్న‌ట్లుగా ఆయ‌న మాట‌లు ఉన్నాయి. రైతుల‌కు ఆరు వేలు ఎంత ముఖ్య‌మ‌న్న విష‌యం ఢిల్లీలోని ఏసీ గ‌దుల్లో కూర్చునే వారికి అస్స‌లు ప‌ట్ట‌దంటూ విరుపులు విరుస్తున్న మోడీ.. త‌న మేజిక్ మాట‌ల‌తో దేశ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచే ప్రోగ్రామ్ ను షురూ చేశారు.

ఆదివారం క‌శ్మీర్ వెళ్లిన ప్ర‌ధాని మోడీ.. అక్క‌డ తాను అమ‌లు చేయ‌నున్న కిసాన్ వికాస్ ప‌థ‌కం గురించి గొప్ప‌లు చెప్పుకొని.. ఆ ప‌థ‌కాన్ని విమ‌ర్శ‌లు చేస్తున్న కాంగ్రెస్‌ పై ఎదురుదాడి చేశారు. తాను స్టార్ట్ చేసిన ప‌థ‌కం కార‌ణంగా క‌శ్మీర్ లోని రైతుల‌కు పెద్ద ఎత్తున ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని చెప్పారు. మోడీ మాష్టారి మాట‌ల్ని విన్న వారంతా.. మా గొప్ప మోడీ ఎంత మంచి ప‌ని చేశాడో అంటూఉక్కిరిబిక్కిరి అవుతున్న‌ట్లుగా బీజేపీ నేత‌లు భావిస్తున్నారు.

అయితే.. విష‌యం మ‌రోలా ఉంద‌ని చెబుతున్నారు. విస్తృత‌మైన సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని..రైతుల్ని ఆదుకునేందుకు మోడీ మాష్టారు ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కం మాతృక తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు ప‌థ‌కం పేరుతో అమ‌ల‌వుతుంద‌ని.. అక్క‌డ ఎక‌రానికి రూ.8వేల చొప్పున కేసీఆర్ స‌ర్కారు ఇస్తుంద‌న్న విష‌యాన్ని తెలుసుకుంటున్న ప‌లువురు మోడీ ప్ర‌భుత్వాన్ని.. ఆయ‌న గొప్ప‌లు చెప్పుకుంటున్న ప‌థ‌కాన్నిత‌ప్పు ప‌డుతున్నారు. ఎక‌రానికి ఏడాదికి రూ.1200 (ఐదు ఎక‌రాలు ఉంటే) మాత్ర‌మే సాయంగా ఇవ్వ‌టం వ‌ల్ల రైతుల‌కు ఒరిగేదేమిట‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ప‌ప్పుబెల్లాలు పెట్టి బిర్యానీ పెట్టినంత క‌టింగ్ ఇవ్వ‌టం మోడీ స‌ర్కారుకే చెల్లిందన్న వ్యంగ్య‌వ్యాఖ్య‌ల్లో వాస్త‌వం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News