కేసీఆరే టార్గెట్.. ఒకే రోజు తేల్చేసిన రెండు పార్టీలు

Update: 2023-06-27 18:03 GMT
'బీజేపీ.. బీఆర్ఎస్ రెండు ఒక్కటే. ఒకే తాను ముక్కలు' అని కాంగ్రెస్ అంటే.. కాదు.. 'కాంగ్రెస్..కేసీఆర్ ఒక్కటే.. తెర వెనుక వారి మధ్య ఒప్పందం ఉంది' అంటూ బీజేపీ నేతలు విరుచుకుపడటం చూస్తుంటాం.

అయితే.. కాంగ్రెస్.. బీజేపీలకు సంబంధించి తమ టార్గెట్ ఎవరన్న విషయాన్ని తాజాగా తేల్చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. గంటల వ్యవధిలోనే రెండు జాతీయ పార్టీలు.. మరో జాతీయ పార్టీ (మొన్నటివరకు ప్రాంతీయ పార్టీ) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను టార్గెట్ చేయటం గమనార్హం.

సంబంధం లేని వేదిక మీద.. అసందర్భంగా తీసుకొచ్చిన మాటను హైలెట్ చేసేందుకు భోపాల్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్.. బీజేపీ మధ్య తెర వెనుక ఒప్పందం జరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతూ.. తెలంగాణలో  కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్ అన్న అంశంపై తెలంగాణ ప్రజలు ఒక అభిప్రాయానికి వస్తున్న వేళ.. అందులో నిజం లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే స్వయంగా రంగంలోకి దిగటం ఆసక్తికరంగా మారింది.

భోపాల్ లో జరిగిన సభలో మాట్లాడిన మోడీ.. కేసీఆర్ కుమార్తెను కాపాడుకోవటానికి బీఆర్ఎస్ కు ఓటు వేయాలని.. ప్రజల్ని కాపాడాలంటే మాత్రం బీజేపీకి ఓటు వేయాలన్న వ్యాఖ్య చేయటం ఆసక్తికరంగా మారింది.

నిజానికి మధ్యప్రదేశ్ లో కేసీఆర్ పేరు పెద్దగా పరిచయం లేనిది. తెలంగాణ ముఖ్యమంత్రిగా కాస్తంత అవగాహన ఉన్నప్పటికీ.. సదరు వేదిక మీద కేసీఆర్ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ.. అందుకు భిన్నంగా మోడీ ఆ మాట అన్నారంటే.. కేసీఆర్ ను.. ఆయన పార్టీని తాము టార్గెట్ చేశామన్న విషయంపై యుద్ధ ప్రాతిపదికన సందేశం ఇవ్వటమే మోడీ ఆలోచనగా చెబుతున్నారు. మోడీ చేసిన వ్యాఖ్యల ప్రకంపనలతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్న వేళలోనే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నోటి నుంచి మరో కీలక ప్రకటన వెలువడింది.

బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు. బీఆర్ఎస్ ను గద్దె దించటమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. బీఆర్ఎస్ తో బీజేపీ కలిసి ఉందన్న వ్యాఖ్యను చేశారు.

ఇదంతా చూస్తే.. రెండు జాతీయ పార్టీలకు చెందిన కీలక నేతలు ఇరువురు తెలంగాణలో తమ టార్గెట్ కేసీఆర్ అన్న విషయాన్ని స్పష్టం చేయటం ఒక ఎత్తు అయితే.. ఒకే రోజున గంటల వ్యవధిలోనే క్లారిటీగా చెప్పేయటం మరో కీలక రాజకీయ పరిణామంగా చెప్పక తప్పదు.

Similar News