పండిట్ తుగ్లక్ పిచ్చి తుగ్లక్ ఎలా అయ్యాడు

Update: 2016-11-17 19:30 GMT
తల తిక్క నిర్ణయాలు తీసుకనేవారిని.... ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచనలు చేసేవారిని... చేసిన పని వల్ల ఇబ్బంది వస్తే మళ్లీ పాత పద్ధతికే వెళ్లే వారిని తుగ్లక్ తో పోలుస్తుంటారు. అది కూడా మామూలుగా కాదు.. పిచ్చి తుగ్లక్ అంటారు. తాజాగా నోట్ల రద్దు నిర్ణయం తరువాత మోడీని కూడా చాలామంది అదే పేరుతో పిలుస్తున్నారు. బీజేపీ నేతలకు ఇది ఆగ్రహం తెప్పిస్తున్నా కొంత మంది జనం మాత్రం తమ కష్టాలకు మోడీయే కారణమంటూ ఆయన్ను తుగ్లక్ తో పోలుస్తున్నారు. ఇంతకీ తుగ్లక్ ఎవరు... నిజంగా తుగ్లక్ పిచ్చోడా...? లేదంటే ఒకట్రెండు తప్పుడు నిర్ణయాల కారణంగా ఆయనకు ఆ పేరు వచ్చిందా అన్నది చూస్తే చరిత్రతలో ఎన్నో ఆసక్తికర విశేషాలు కనిపిస్తాయి.
    
మహ్మద్ బీన్ తుగ్లక్ 1325 నుంచి 1351 వరకు ఢిల్లీని పాలించిన సుల్తాన్. అందరూ అనుకుంటున్నట్లు ఆయనేమీ పిచ్చోడు కాదు. మహా పండితుడు. తర్కం - తత్వం - ఖగోళ శాస్త్రం - భౌతిక .. గణిత శాస్త్రాలు క్షుణ్నంగా తెలిసిన పండితుడు. అనేక కళల్లో ప్రవేశమున్న విద్వాంసుడు. అయితే.. అమోఘమైన తెలివితేటలున్నా కూడా ఆయనకు పిచ్చివాడిగా ముద్రపడడానికి కారణం ఆయన తొందరపాటే. ఏదైనా ఆలోచన వస్తే మంచీచెడు ఆలోచించకుడా.. పర్యవసానాలు... ప్రత్యామ్నాయాలు, చేయాల్సిన ఏర్పాట్లు గురించి ఏమీ ఆలోచించకుండా తన బుర్రలోని ఆలోచనను అమలు చేసేసేవాడు. అది వికటించేది. దాంతో సదుద్దేశంతో చేసే పనైనా చెడిపోయేది. దాంతో జనం ఆయన్ను పిచ్చి తుగ్లక్ అనడం ప్రారంభించారు.
    
తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుంచి మార్చడం వెనుక కూడా పెద్ద వ్యూహం ఉంది. భారత ద్వీపకల్పం లోని ప్రాంతాలను జయించి తన సామ్రాజ్య విస్తరణకు సంకల్పించిన ఆయన అందులో భాగంగా దేశ దక్షిణ ప్రాంతాలపై పట్టు సాధించేందుకు రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరి కి మార్చాడు. ఢిల్లీ నుండి 700 మైళ్ళ దూరాన దక్కను లోగల దేవగిరిని - దౌలతాబాదు గా పేరుమార్చి రాజధానిగా ప్రకటించాడు. తన ప్రభుత్వకార్యాలయాలను మాత్రమే గాక , మొత్తం ప్రజానీకాన్నీ దౌలతాబాదుకు మకాం మార్చాలని హుకుం జారీ చేశాడు.అయితే దౌలతాబాదులో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కలుగజేయడంలో ఫెయిలవడంతో చెడ్డపేరొచ్చింది. కనీస వసతులైన నీటి సరఫరా కూడా చేయలేకపోయాడు. కేవలం రెండేండ్లలో తిరిగి రాజధానిని ఢిల్లీకి మార్చాల్సి వచ్చింది.  ఈ అసంబద్ధ నిర్ణయానికి బలై - వలసలతో ఎందరో జనం మరణించారు.
    
తుగ్లక్ అమలు చేయడంలో విఫలమైన పిచ్చోడిగా పేరు తెచ్చకున్న మరో నిర్ణయం నాణేలు. తన రాజ్యంలో నల్లదనాన్ని అరికట్టడం కోసం నాణేలను మార్చాడాయన. నాణేల ముద్రణ వ్యయం తగ్గించుకోవడమే కాకుండా, నల్ల కుబేరులను కట్టడి చేయాలనే సదుద్దేశంలో తుగ్లక్ బంగారు - వెండి నాణెంల స్థానంలో రాగి - ఇత్తడి నాణేలు ప్రవేశపెట్టాడు. కానీ.. దీంతో నకిలీలు పెరిగిపోయాయి. దాంతో చేసిన తప్పును గ్రహించి మళ్లీ రాగి - ఇత్తడి నాణెంలను వెనక్కి తీసుకొని బంగారు - వెండి నాణేలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కుప్పలు తెప్పలుగా కోట ముందు గుట్టలుగా వచ్చి పడిన రాగి - ఇత్తడి నాణేలలో అసలివి ఏవి , నకిలీవి ఏవి తెలుసుకోలేక తుగ్లక్ అధికార యంత్రాంగం విఫలమైంది. ఫలితంగా ప్రజల్లో అలజడి చెలరేగి విభజన - విముక్తి ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. బెంగాల్ - దక్కన్ వాటంతట అవే స్వాతంత్య్రాన్ని ప్రకటించుకొని విడిపోయాయి. పెద్ద సామ్రాజ్యమైన తుగ్లక్ రాజ్యం మళ్లీ ఢిల్లీకే పరిమితం కావాల్సి వచ్చింది.  అంతేకాదు... రాజ్యానికి చెందిన 75 శాతం సంపద హరించుకుపోయింది. అన్నీ కలిసి తుగ్లక్ ను పిచ్చోడిగా చరిత్రలో సుస్థిర స్థానం కల్పించాయి.
    
ఇదీ తుగ్లక్ కథ.... సమకాలీన ప్రపంచంలో చాలామందిలో ఇలాంటి పోలికలు కనిపిస్తుండడంతో వారందరినీ తుగ్లక్ వారసులు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News