మోహ‌న్ బాబు ఆహ్వానం సీబీఎన్‌కేనా.. జ‌గ‌న్‌కు లేదా?

Update: 2022-07-27 04:42 GMT
ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్ బాబు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుల‌ది ఇద్దరిదీ ఒక‌టే జిల్లా.. అది చిత్తూరు. అలాగే ఇద్ద‌రూ క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారే. ఇద్ద‌రి మ‌ధ్య కాస్త బంధుత్వం కూడా ఉంది. దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్‌ను ప‌ద‌వీచ్యుతిడిని చేసి చంద్ర‌బాబు సీఎం అయ్యాక మోహ‌న్ బాబు.. చంద్ర‌బాబుకే జైకొట్టారు. వాస్త‌వానికి మోహ‌న్ బాబును ఎన్టీఆర్ త‌న సొంత సోదరుడిలానే చూశారు. ఈ బంధంతోనే మోహ‌న్ బాబు నిర్మించిన మేజ‌ర్ చంద్ర‌కాంత్ సినిమాలోనూ న‌టించారు. అయితే టీడీపీ రాజ‌కీయ సంక్షోభంలో అప్ప‌టి ప‌రిస్థితుల్లో మోహ‌న్ బాబు.. చంద్ర‌బాబుకే జై అన్నారు. ఇందుకు ప్ర‌తిఫ‌లంగా ఆయ‌న‌కు రాజ్య‌స‌భ సీటు కూడా ద‌క్కింది.

అయితే ఆ త‌ర్వాత కాలంలో ఎందుకో మోహ‌న్ బాబు, చంద్ర‌బాబు మ‌ధ్య పొర‌పొచ్చాలు వ‌చ్చాయి. హెరిటేజ్ డెయిరీలో త‌న‌కు వాటా ఉంద‌ని, తామిద్ద‌రం భాగ‌స్వాముల‌మ‌ని మోహ‌న్ బాబు ప‌లుమార్లు మీడియాకు వెల్ల‌డించారు. అప్ప‌టి నుంచి చంద్ర‌బాబుతో ఉప్పూనిప్పుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో తిరుప‌తిలో ఉన్న త‌న కాలేజీకి ఫీజు రీయింబ‌ర్స్మెంట్ నిధులు ఇవ్వ‌డం లేద‌ని మోహ‌న్ బాబు విద్యార్థుల‌తో క‌లిసి రోడ్డు మీద ధ‌ర్నా చేయ‌డం కాక‌రేపింది.

ఆ త‌ర్వాత మోహ‌న్ బాబు, ఆయ‌న కుమారుడు విష్ణు.. వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. మోహ‌న్ బాబుకు రాజ్య‌స‌భ ఎంపీ ప‌ద‌వి లేదా టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విని ఇస్తార‌ని వార్త‌లు వ‌చ్చినా అవి నిజం కాలేదు. మ‌రోవైపు మోహ‌న్ బాబుకు జ‌గ‌న్‌తోనూ బంధుత్వం ఉంది. వైఎస్ జ‌గ‌న్ సొంత బాబాయి కుమార్తె విరానికాను విష్ణు ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో మోహ‌న్ బాబు టీడీపీ అధినేత చంద్ర‌బాబును తన కుమార్తె ల‌క్ష్మి మంచుతో క‌లిసి క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. దాదాపు గంట‌కు పైగా చంద్ర‌బాబు నివాసంలో ఈ ఇద్ద‌రూ చ‌ర్చలు జ‌రిపారు. దీంతో వీరిద్దరి భేటీ చర్చనీయాంశమైంది. సినిమా టికెట్ల వ్య‌వ‌హారంలో త‌న‌ను చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించ‌లేద‌ని సీఎం జ‌గ‌న్ పై మోహ‌న్ బాబు గుస్సాగా ఉన్నార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా చిరంజీవికి ప్రాధాన్య‌త క‌ల్పించ‌డం ప‌ట్ల మోహ‌న్ బాబు కినుక వ‌హించార‌ని చెప్పుకున్నారు.

మ‌రోవైపు మోహ‌న్ బాబు గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీకి ప్ర‌చారం చేసినా ఆయ‌న‌కు ఇప్ప‌టివ‌ర‌కు ఏ ప‌ద‌వీ ద‌క్క‌లేదు. ఈ అసంతృప్తితోనే ఆయ‌న చంద్ర‌బాబు పంచ‌న చేరార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు తాను సాయిబాబా ఆల‌యం ప్రారంభోత్స‌వానికి రావాల‌ని ఆహ్వానించేందుకే చంద్ర‌బాబును క‌లిశాన‌ని మోహ‌న్ బాబు చెబుతున్నా కార‌ణం ఇది కాద‌ని అంటున్నారు. ఆహ్వానం చంద్ర‌బాబుకేనా? సీఎం జ‌గ‌న్ కు ఆహ్వానం లేదా అని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది.

తిరుపతికి సమీపంలోని తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ ఆవరణలో మోహ‌న్ బాబు చేప‌ట్టిన సాయిబాబా ఆలయం నిర్మాణ ప్రారంభోత్స‌వానికే చంద్ర‌బాబును పిల‌వ‌డానికి వెళ్లార‌ని అంటున్నారు. అయితే అస‌లు కార‌ణం మాత్రం ఇది కానే కాద‌ని అంటున్నారు.. నెటిజ‌న్లు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు జైకొట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News