అత్త, అల్లుళ్ల మధ్య చిచ్చు పెట్టిన ఆధిపత్య పోరు..!

Update: 2019-11-13 11:01 GMT
రాజకీయాలలో ఏదైనా సాధ్యమే. పిల్లని బల్లి , బల్లిని పిల్లి చేయగలిగేది ఒక్క రాజకీయనేతలు మాత్రమే. ఎందుకు ఆంటే అప్పటివరకు బద్ద శత్రువులుగా ఉన్న వారు ..క్షణం వ్యవధిలోనే బాల్య స్నేహితులుగా మారగలరు. అలాగే అప్పటివరకు ఒకటే కుటుంబంగా ఉన్నవారిని కూడా బద్ద శత్రువులుగా మార్చ గలిగే శక్తి ఒక్క రాజకీయానికి మాత్రమే ఉంది. ఇక ఇది రెండు వేరు వేరు పార్టీలలో ఉన్న వారి మధ్య వస్తుంది అనుకుంటే పొరపాటే. ఒకే పార్టీలో ఉన్నా కూడా ఆధిపత్యం కోసం కొందరు పోరాడుతుంటారు.  

తాజాగా టిఆర్ఎస్ లో ఆధిపత్య పోరు మొదలైంది. ప్రస్తుతం తెలంగాణ లో ఉన్న కీలక నేతలందరూ దాదాపుగా టిఆర్ఎస్ లోనే ఉన్నారు. ఎన్నికల సమయంలో కొందరు , ఆ తరువాత కొందరు ఇలా మొత్తం కారెక్కేసారు. దీనితో అందరూ ఇప్పుడు ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో  ఆధిపత్య పోరుకు తెరలేచింది. మొన్నటి వరకు మంత్రిగా వున్న పట్నం మహేందర్ రెడ్డికి, ఈ మధ్య గులాబీ తీర్థం పుచ్చుకుని మంత్రి పదవి పొందిన సబితా ఇంద్రారెడ్డికి మధ్య ఆధిపత్య పోరు ముదురుతోందని చెప్పుకుంటున్నారు. ఏడాది క్రితం వరకు కొనసాగిన తన హవా ఒక్కసారిగా తగ్గిపోవడంతో మహేందర్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని గులాబీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్నాయి. అనుకోకుండా దొరికిన పట్టును కొనసాగించేందుకు సబితా ఇంద్రారెడ్డి కూడా పట్టుదలతో వున్నట్లు తెలుస్తోంది.

మొన్నటి వరకు పట్నం మహేందర్ రెడ్డి మంత్రి. 2018 అసెంబ్లీ ఎన్నికలకు వరకు జిల్లాను శాసించారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా…ఎమ్మెల్సీగా గెలిచి ఉనికి కాపాడుకున్నారు. కానీ మారిన రాజకీయ సమీకరణాలతో మహేందర్ రెడ్డికి అత్త వరసయ్యే సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. అంతే ఆ అల్లుడు సైలెంట్‌ అయ్యారు. అల్లుడి అవకాశాలను అత్త దెబ్బ కొడుతోందని కథనాలొస్తున్నాయి.గతంలో టిడిపిలో వున్న పట్నం మహేందర్ రెడ్డి 2014 ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గంలో మంత్రి అయ్యారు మహేందర్ రెడ్డి. నాలుగున్నరేళ్ల పాటు రవాణా మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్నీతానై నడిపించారు.

2018 వరకు ఆయన రాజకీయ జీవితం కూల్‌గానే సాగింది. కానీ ముందస్తు ఎన్నికలు మహేందర్‌రెడ్డిని ఇబ్బందుల్లోకి నెట్టాయి. 2018 ఎన్నికల్లో తాండూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచి మళ్లీ మంత్రిపదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇక్కడే మళ్లీ మహేందర్‌రెడ్డికి కొత్త చిక్కు వచ్చిపడింది. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సబితా ఇంద్రారెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. మహేందర్‌రెడ్డికి ఆమె స్వయానా అత్త. ఆమె రాకతో మహేందర్‌రెడ్డికి ఇబ్బందికరంగా మారింది.

ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో తనకు ప్లేస్‌ దక్కుతుందని ఆశించిన మహేందర్‌రెడ్డికి నిరాశే ఎదురైంది. అత్త సబితా ఇంద్రారెడ్డి కేబినెట్‌లో చోటు దక్కడంతో అల్లుడిని పక్కనబెట్టారు. ఇటు తాండూరు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో నియోజకవర్గంలో కూడా రెండు గ్రూపులు తయారయ్యాయి. దీంతో మహేందర్‌రెడ్డికి వర్గపోరు నడుస్తోంది.  ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయ భవిష్యత్‌ ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆయన ఏదైనా నామినేటేడ్‌ పోస్టు దక్కించుకుని…జిల్లాలో చక్రం తిప్పాలని ప్లాన్‌  చేస్తునట్టు సమాచారం.
Tags:    

Similar News