ఈయన దట్టీ కడితే.. అధికారమే..

Update: 2019-03-24 09:34 GMT
మనం ఏదైనా కార్యక్రమం ప్రారంభించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ముందుగా ఇష్టమైన దైవాన్ని పూజించి ఆ తరువాత పనులు ప్రారంభిస్తాం. ఈ సంప్రదాయం ముస్లింలల్లో కూడా ఉంటుంది.. వారు ఏదైనా కార్యక్రమాన్ని మొదలుపెట్టేటప్పుడు దట్టీ ధరించడం అలవాటు. కుడిచేతి భుజానికి దీనిని కడుతారు. పవిత్రమైన మసీదుల్లో ప్రార్థనలు చేసి దీనిని ధరించడం వల్ల చేసే పని విజయవంతం అవుతుందని నమ్మకం.

ఈ నమ్మకం కేసీఆర్‌ లోనూ ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. సాధారణంగానే ఆధ్యాత్మిక భావనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కేసీఆర్‌ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారు. ఇందులో భాగంగా ఆయన తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి కుడిచేతికి దట్టీ కట్టుకోవడం అలవాటుగా మారింది.

అయితే ఈ దట్టీని ప్రస్తుత హోంమంత్రి మహ్మద్‌ అలీ చాలా రోజుల నుంచి కేసీఆర్‌ కు కడుతుండడం విశేషం. ఆయన ఎక్కడ పర్యటించినా స్థానిక ముస్లిం పెద్దలు కేసీఆర్‌ కు దట్టీ కడుతారు. కానీ మహ్మద్‌ అలీ కట్టే దట్టీ ప్రాధాన్యత సంతరించుకున్నదని చెప్పుకుంటారు. ఎందుకంటే మహ్మద్‌ అలీ కేసీఆర్‌ కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేయించి  కేసీఆర్‌కు కడుతారట.

దట్టీ ప్రస్తావన ఇప్పుడు రావడానికి పెద్ద కారణమే ఉంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాసయాద్‌ కుమారుడు తలసాని సాయికిరణ్‌ కు హోంమంత్రి మహ్మద్‌ అలీ ఓ ప్రచార సభలో దట్టీ కట్టారు. దీంతో సాయికిరణ్‌ ఉబ్బితబ్బిబ్బై పోయాడు. ఈ సందర్భంగా సాయికిరణ్‌ మాట్లాడుతూ ' మహ్మద్‌ అలీ సాబ్‌ గారు ముఖ్యమంత్రికి ఎలాగైతే దట్టీ కట్టి ఆశీర్వదిస్తారో.. అలాగే నాకు దట్టీ కట్టి దీవెనలు అందించారు... దీంతో నా గెలుపు ఖాయమని అర్థమైంది' అని చెప్పారు.

దీంతో దట్టికి ఉన్న ప్రాధాన్యత ఏంటో అక్కడి నేతలు తీవ్రంగా చర్చించుకున్నారు. అంతకుముందు కేసీఆర్‌ ఎక్కువగా దట్టీ ధరించడాన్ని చూసి కొందరు నేతలు కూడా స్థానికంగా ఉన్న ముస్లింపెద్దలతో ప్రముఖులకు దట్టీ కట్టడం సాంప్రదాయంగా మారింది. అయితే మహ్మద్‌అలీ కట్టిన దట్టీకి ఎక్కువగా ప్రాధాన్యత ఉందని ఎంపీ అభ్యర్థి సాయికిరణ్‌ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.


Tags:    

Similar News