అల్లుడుగారు ఆశ ప‌డుతున్నార‌టగా కేసీఆర్‌?

Update: 2018-08-27 04:29 GMT
తిరుగులేని అధికారంలో దూసుకెళ్లిపోతున్న వేళ‌.. ముఖ ప‌రిచ‌యం ఉన్న వారికి సైతం ఏవో కొన్ని కోరిక‌లు ఉంటాయి. అలాంటిది పిల్ల‌ను ఇచ్చిన మామ ముఖ్య‌మంత్రిగా ఉంటే.. ఆ అల్లుడుగారికి ఏదో ఒక ఆశ ఉంటుందిగా?  ఇప్పుడు అలాంటి ఆశ‌కు సంబంధించిన ముచ్చ‌ట టీఆర్ ఎస్ నేత‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చర్చ‌గా మారింది.

నిజామాబాద్ ఎంపీ క‌విత భ‌ర్త‌గా సుప‌రిచితుడైన అనిల్ కుమార్‌.. ఎప్పుడూ రాజ‌కీయ వేదిక‌ల మీద యాక్టివ్ గా పాల్గొన్న‌ది లేదు. వ్యాపార‌వేత్త‌గా త‌న ప‌ని తాను అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తారే త‌ప్పించి.. రాజ‌కీయాల‌కు త‌గినంత దూరంగా ఉండ‌టం క‌నిపిస్తుంటుంది. రాజ‌కీయ సమావేశాల‌కు.. వేదిక‌ల మీద ఎక్క‌డా క‌నిపించ‌ని అనిల్‌.. వేడుక‌లు.. ఫ్యామిలీ ఫంక్ష‌న్లు.. ఏదైనా ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాల స‌మ‌యంలోనే ఎంపీ క‌విత‌తో పాటు క‌నిపిస్తూ ఉంటారు.

వివాదాల‌కు దూరంగా ఉంటూ.. త‌న ప‌రిధిలో తాను ఉండే అనిల్ కుమార్ తాజాగా టికెట్ ఆశ‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ముంద‌స్తుఎన్నిక‌ల నేప‌థ్యంలో అనిల్ కుమార్ ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే..  ఈ విష‌యంపై టీఆర్ఎస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. ఈసారి ఎంపీ క‌విత అసెంబ్లీ నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. కేసీఆర్ ఇందుకు స‌ముఖంగా లేర‌న్న మాట వినిపిస్తోంది. క‌విత‌ను లోక్ స‌భ‌కు ప‌రిమితం చేయాల‌న్నది ఆయ‌న ఆలోచ‌న‌గా తెలుస్తోంది.

ఒక‌వేళ అదే నిజ‌మైతే.. క‌విత‌కు కాకుండా త‌న‌కైనా పార్టీ టికెట్ ఇవ్వాల‌న్న మాట‌ను ఇప్ప‌టికే మామ‌య్య కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టికే టీఆర్ ఎస్ లో కేసీఆర్ ఆయ‌న కుమార్తె.. కుమారుడు.. మేన‌ల్లుడు కీల‌క స్థానాల్లో ఉండ‌టాన్ని ప‌లువురు ప్ర‌శ్నిస్తుంటారు. ఫ్యామిలీ ప్యాకేజీగా మారింద‌న్న విమ‌ర్శ ఉంది. ఇలాంటి వేళ‌లో.. అల్లుడుగారికి టికెట్ ఇవ్వ‌టం లాంటివి చేస్తే.. లేనిపోని త‌ల‌నొప్పులు వ‌స్తాయ‌న్న మాట వినిపిస్తూ ఉంది. ఇదిలా ఉంటే.. తిరుగులేని అధికారంలో చేతిలో ఉన్న‌ప్పుడు... అయిన వారి కోసం కేసీఆర్ ఆ మాత్రం చేసుకోక‌పోతే ఏం బాగుంటుంద‌న్న మాట కూడా వినిపిస్తోంది.


Tags:    

Similar News