యువనేత నిర్ణయం జిల్లాలో చిచ్చు పెట్టిందా ?

Update: 2022-07-27 05:07 GMT
ఇపుడిదే అంశం ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఒక నిర్ణయం తీసుకున్నారట. అదేమిటంటే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీచేయాలని. ఎంపీగా రెండుసార్లు గెలిచిన రామ్మోహన్ ఎంఎల్ఏగా ఎందుకు పోటీచేయాలని అనుకుంటున్నారు ? ఎందుకంటే ఎంపీగా తనకు తగిన ప్రాధాన్యత దక్కటం లేదని తీవ్రమైన అసంతృప్తిగా ఉన్నారట.

జాతీయ రాజకీయాల్లో టీడీపీ చక్రం తిప్పే అవకాశాలు దాదాపు లేవన్న విషయం అర్ధమైపోయిందట. అందుకనే ఎంపీగా ఎన్నిసార్లు గెలిస్తేమాత్రం ఉపయోగం ఏమిటని మద్దతుదారులు, కుటుంబసభ్యులు గట్టిగా అడుగుతున్నారట.

అదే ఎంఎల్ఏగా గెలిస్తే మంత్రి అయిపోవచ్చని అప్పుడు రాష్ట్రంలో బాగా ప్రాధాన్యత దక్కుతుందని కుటుంబ సభ్యుల పోరు బాగా ఎక్కువైపోయిందని సమాచారం. మద్దతుదారుల, కుటుంబసభ్యుల వాదనకు ఎంపీగా కూడా సానుకూలంగా ఉన్నారట. అందుకనే ఇదే విషయాన్ని చంద్రబాబునాయుడుతో కూడా చెప్పినట్లు సమాచారం.

అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే టీడీపీ అధికారంలోకి వచ్చినా బాబాయ్ అచ్చెన్నాయుడును కాదని రామ్మోహన్ కు మంత్రిపదవి దక్కే అవకాశం లేదు. పైగా శ్రీకాకుళం ఎంపీగా కొత్త నేతను వెతుక్కోవటం అంత వీజీకాదు. అచ్చెన్నాయుడును పోటీ చేయిద్దామంటే ఆయన ఒప్పుకోలేదని సమాచారం. బాబాయ్, అబ్బాయ్ ఇద్దరు అసెంబ్లీకే పోటీ చేస్తే పార్టీలో గొడవలు బాగా పెరిగిపోతాయన్నది నేతలు చంద్రబాబుకు చెబుతున్నారట. ఎందుకంటే ఇప్పటికే వీళ్ళద్దరి మధ్య సంబంధాలు అంతంత మాత్రమే అని అందరికీ తెలుసు.

వచ్చే ఎన్నికల్లో ఎంపీగానే పోటీచేయమని చంద్రబాబు చెప్పినా రామ్మోహన్ ఒప్పుకోలేదట. పైగా నరసన్నపేటలో ఎంఎల్ఏగా పోటీచేయటం ఖాయమని చెప్పుకుంటున్నారట. దీనికి నియోజకవర్గ ఇన్చార్జి బగ్గు రమణమూర్తి కూడా మద్దతిచ్చారట. దీంతో అబ్బాయ్ ఎక్కువగా నరసన్నపేట మీద దృష్టిపెట్టారు. దీంతో ఏమి చేయాలో ఇటు బాబాయ్ తో పాటు చంద్రబాబుకు తోచటం లేదట. రామ్మోహన్ గనుక ఎంఎల్ఏగా పోటీచేస్తే జిల్లా సమీకరణలు మారిపోయే అవకాశాలున్నాయి. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
Tags:    

Similar News