విశాఖ కిడ్నాప్ కేసులో షాకింగ్ ఇష్యూ... ఎంపీ జస్ట్ మిస్!

Update: 2023-06-17 09:42 GMT
విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులతో పాటు, ఆడిటర్ జీవీ కిడ్నాప్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై మరింత డిటైల్డ్ గా వివరించే ప్రయత్నం చేశారు ఎంపీ ఎంవీవీ. ఈ సందర్భంగా ఆయన చెప్పిన ఈ మొత్తం ఉదంతం క్రైం సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండటం గమనార్హం.

అవును... తాజాగా తన కుటుంబ సభ్యులతోపాటు, తన ఆడిటర్ జీవీ కూడా కిడ్నాప్ అయిన వ్యవహారన్ని కళ్లకు కట్టినట్లు తెలిపారు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.

తొలుత మంగళవారం రుషికొండ ప్రాంతంలో నివాసముంటున్న ఎంపీ కుమారుడు ఇంటిలోకి చాకచక్యంగా వెళ్లగలిగిన ఈ కిడ్నాపర్ లు... ఆ సమయంలో ఎంపీ కుమారుడిని కట్టేసి, పీకపై కత్తి పెట్టి.. బయట ఉన్న సెక్యూరిటీ గార్డు, వాచ్ మెన్ లను పంపించేశారు. ఆ సమయంలో తన కోడలు బెంగళూరులో ఉన్నట్లు ఎంపీ చెబుతున్నారు. అనంతరం అతడితో తన తండ్రి అయిన ఎంపీకి ఫోన్ చేయించి.. తాను నీరసంగా ఉన్నానని, మోషన్స్ ఉండటం వల్ల బయటకు రాలేనని తెలిపాడు.

అయితే ఆ సమయంలో ఎంపీ కుమారుడి వద్ద వారు ఆశించిన స్థాయిలో పెద్ద మొత్తంలో సొమ్ము దొరకకపోవడంతో... ఎంపీ భార్యకు కాల్ చేయించారు. ఏమీ తెలియనట్లుగా "అమ్మా నాకు కాస్త నీరసంగా ఉంది.. ఒకసారి ఇంటికి రా" అని ఏమీ జరగనట్లుగా పీకమీద కత్తిపెట్టి, ఎలాంటి అనుమానం రాకుండా కాల్ చేయించారు. ఈ సమయంలో ఎంపీ కూడా అతని భార్యతో కుమారుడి ఇంటికి వెళ్లాలని అనుకున్నప్పటికీ... ఆయన హైదరాబాద్ వెళ్లాల్సి ఉండి, ఆయన విమానాశ్రయానికి వెళ్లిపోయారు. ఆ కారణమే తాను కిడ్నాపర్ లకు చిక్కకుండా కాపాడిందని ఎంపీ చెబుతున్నారు.

అనంతరం కుమారుడి ఇంటికి చేరిన ఎంపీ భార్యను సైతం కిడ్నాపర్ లు బంధించారు. ఆమెవద్ద కూడా వీరు ఆశించిన స్థాయిలో బంగారం, నగలు దొరకకపోయే సరికి.. ఎంపీ వచ్చే వరకూ వెయిట్ చేయాలని భావించారు. ఈ సమయంలో తన భార్య తన ఆడిటర్ జీవీ కి కాల్ చేసి ఒకసారి రమ్మని చెప్పినట్లుల్ ఎంపీ తెలిపారు. కిడ్నాప్ వ్యవహారం గ్రహించని జీవీ... ఎంపీ కుమారుడి ఇంటికి వెళ్లారు.

ఆ సమయంలో అప్పటికే ఎంపీ కుమారుడి నుండి 15 లక్షలు తీసుకున్న కిడ్నాపర్ లు... జీవీని సైతం బంధించారు. ఆ సమయంలో జీవీ... ఎంపీ కుమారుడి అకౌంట్ నుంచి 60 లక్షలు విత్ డ్రా చేయించి ఇవ్వడంతోపాటు తన డ్రైవర్ తో ఒక కోటి రూపాయలు తెప్పించి ఇచ్చారు. అయితే కిడ్నాపర్ లు ఆ సొమ్ముతో తృప్తి చెందలేదని ఎంపీ వివరించారు. అయితే కిడ్నాపర్ ల లక్ష్యం తాను సిటీకి వస్తే.. తన దగ్గర సుమారు 20 కోట్ల వరకూ డిమాండ్ చేయొచ్చని భావించడమే అని ఎంపీ తెలిపారు.

అయితే ఈ విషయాలపై జీవీ... "ఎంపీ వస్తే సెక్యూరిటీ ఉంటుంది.. మీకు ఇబ్బంది కలుగుతుంది.. తన వరకూ ఒక ఐదుకోట్లు ఇవ్వగలుగుతానని" చెప్పినట్లు ఎంపీ ఎంవీవీ వివరించారు. అంతకంటే ముందు తనను ఇక్కడ డ్రాప్ చేసినట్లు ఎవరికీ చెప్పొద్దని, నువ్వు వెళ్లి నీ పని చూసుకోమని జీవీతో ఆయన కార్ డ్రైవర్ కి కూడా కిడ్నాపర్ లు ఎలాంటి అనుమానం రాకుండా ఫోన్ చెప్పించారు.

ఈ సమయంలో రెండు రోజులుగా కుమారుడు, భార్య కూడా ఎంపీతో ఎలాంటి అనుమానం కలగకుండానే ఫోన్స్ మాట్లాడటం గమనార్హం. ఇదే సమయంలో ఎంపీ కుమారుడితో కూడా.. ఆయన కోడలకు కూడా ఎలాంటి సందేహం రాకుండా ఫోన్ చేయించారు. పీకమీద కత్తిపెట్టి.. కిడ్నాపర్ లు ఆ జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఆడిటర్ తో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్న వేళ ఎంపీకి కొంత అనుమానం కలగడం ఈ కేసులో కీలక పరిణామంగా చెబుతున్నారు.

ఈ సమయంలో తనకు వేరే పని ఉండి జీవీకి ఎంపీ కాల్ చేశారు. ఆ సమయంలో కూడా జీవీ ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడి పెట్టేశారు. మరుసటి రోజు ఉదయం "జీవీ రాత్రి ఇంటికి రాలేదు" అని జీవీ ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి ఎంపీకి కాల్ వచ్చింది. దీంతో ఎంపీ అనుమానం మరింత బలపడింది.

జీవీకి కాల్ చేసిన సమయంలో ఆందోళనతో ఉన్నట్లు గమనించిన ఎంపీ, రాత్రి ఇంటికి కూడా రాలేదని కుటుంబ సభ్యులు చెప్పడంతో... కమిషనర్ కి కాకుండా డిపార్ట్ మెంట్ లో తనకు తెలిసిన పోలీసుకు ఫోన్ చేసి, తన ఆడిటర్ ఏదో సమస్యలో ఉన్నట్లుగా తనకు అనుమానం ఉందని, విషయం బయటకు పొక్కకుండా తెలుసుకోమని తెలిపినట్లు చెప్పారు. ఆ సమయంలో జీవీ ఫోన్ ని ట్రేస్ చేసిన పోలీసులు.. ఆయన రుషికొండలోనే ఉన్నట్లు తెలిపారు. అయితే ఆ సమయంలో తాను శ్రీకాకుళంలో ఉన్నట్లు జీవీ... ఎంపీకి తెలిపారు.

దీంతో తన అనుమానం నిజమని గ్రహించిన ఎంపీ... విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారులకు చెప్పి.. జాగ్రత్తగా హ్యాండిల్ చేయమని సూచించడంతో వ్యవహారం మొత్తం తెరపైకి వచ్చింది.

ఇక్కడ గమనించాల్సిన మరో ఆందోళన కలిగించే అంశం ఒకటుంది. తన కుమారుడు నీరసంగా ఉందని, తన ఇంటికి రావాలని కాల్ చేసినప్పుడు ఎంపీ కూడా తన భార్యతో కలిసి వెళ్లాల్సి ఉంది. అయితే ఆ సమయానికి ఆయనకు హైదరాబాద్ ఫ్లైట్ ఉండటం వల్ల మిస్ అయ్యారు. మరొక విషయం ఏమిటంటే... రాత్రి సమయాల్లో తన పర్సనల్ మీటింగులకు, ఫ్యామిలీ గెట్ టుగెదర్ లకు వెళ్లేటప్పుడు ఎంపీ తన సెక్యూరిటీని తీసుకుని వెళ్లరంట. అంటే... ఆ రోజు ఎంపీకి హైదరాబాద్ ప్రోగ్రాం లేకపోతే... వితౌట్ సెక్యూరిటీ ఆయన కూడా కిడ్నాపర్ లకు చిక్కేవారన్నమ్మాట!!

Similar News