చిన్నల్లుడి దశ తిరిగింది... ఎంపీగా కంఫర్మ్...

Update: 2023-03-20 13:00 GMT
ఒక్కోసారి అలా జరిగిపోతూ ఉంటుంది. 2019 ఎన్నికల్లో చిట్ట చివరి నిముషం వరకూ ఎటూ తేల్చక ఆఖరున విశాఖ టీడీపీ ఎంపీ సీటుని బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ కి చంద్రబాబు కేటాయించారు. అయితే ఆ లేట్ కి తగిన మూల్యాన్ని శ్రీ భరత్ చెల్లించుకున్నారు. అతి స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలు అయ్యారు. ఓడిన మరుక్షణం శ్రీ భరత్ విశాఖ ఎంపీ సీటుని అట్టిపెట్టుకునే తన రాజకీయాన్ని చేస్తూ వస్తున్నారు.

గత మూడేళ్ళుగా చూస్తే శ్రీ భరత్ కి విశాఖ ఎంపీ సీటు ఇవ్వడం డౌటే అన్న ప్రచారం సాగింది. ఒక దశలో అయితే శ్రీ భరత్ ని భీమిలీ నుంచి పోటీ చేయిస్తారని, అలాగే విశాఖ ఉత్తరం సీటు ఇస్తారని కూడా వినిపించాయి. అయితే ఇపుడు మాత్రం విశాఖ ఎంపీ సీటు శ్రీ భరత్ కి ఇవ్వడం తధ్యమని అంటున్నారు. దానికి కారణం శ్రీ భరత్ పాత్ర కూడా ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలుపు విషయంలో ఉండడమే.

అంగబలం అర్ధబలం రెండూ అవసరం అయిన ఈ ఎన్నికల్లో శ్రీ భరత్ తన చేయి కూడా వేశారని చెప్పుకుంటున్నారు. చంద్రబాబు కూడా శ్రీ భరత్ కి ఎమ్మెల్సీ సీటుని గెలిపించే బాధ్యతలు అప్పగించారని ప్రచారం సాగింది. ఆ సీటు గెలిపిస్తే ఎంపీ సీటుని ఖరారు చేస్తామని చెప్పారని పార్టీలో గుసగుసలు వింపించాయి.

ఇపుడు ఎమ్మెల్సీ సీటు ఎటూ టీడీపీ గెలిచింది. దాంతో శ్రీభరత్ కి వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి రూట్ క్లియర్ అయింది అని అంటున్నారు. ఆయన పార్లమెంట్ సీటు లో పార్టీ బాధ్యతలను ఇప్పటికే చూసుకుంటున్నారు. ఒక వైపు గీతం వర్శిటీ బాధ్యతలు చూస్తూనే పార్టీ కోసం సమయం కేటాయిస్తున్నారు.

శ్రీ భరత్ తాత మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి రెండు సార్లు గెలిచిన సీటు విశాఖ ఎంపీ సీటు. దాంతో ఆ రాజకీయ వారసత్వాన్ని అందుకుని తానూ ఎంపీ కావాలని పట్టుదల మీద ఉన్న శ్రీ భరత్ కి ఇపుడు అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. దాంతో యువకుడు అయిన శ్రీ భరత్ విశాఖ ఎంపీగా పోటీ చేయడం ఖాయమైపోయింది అన్న మాట.

ఆయన తన పరిధిలోని ఎమ్మెల్యే సీట్లలో సైతం పార్టీని గెలిపించే బాధ్యతల్ను భుజాన వేసుకుంటున్నారు. అభ్యర్ధుల ఎంపికలో సైతం భరత్ అధినాయకత్వానికి సూచనలు ఇస్తున్నారు. గతంలో ఎంవీవీఎస్ మూర్తి ఇలాంటి ముఖ్య పాత్రను పోషించడమే కాదు అన్ని విధాలుగా పార్టీకి అండగా ఉండేవారు. ఇపుడు ఆ ప్లేస్ లోకి వచ్చారని అంటున్నారు. మొత్తానికి విశాఖ ఎంపీ సీటుతో పాటు కీలక నియోజకవర్గాలకు అభ్యర్ధులను ఎంపిక చేయడంతో టీడీపీ ముందుంది అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News