అవును.. ముద్రగడ దీక్ష కొనసాగుతోంది

Update: 2016-06-17 07:58 GMT
కాపు ఉద్యమనేత.. మాజీ మంత్రి ముద్రగడ పద్మానాభం దీక్షకు సంబంధించి తాజాగా గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఓపక్క ఆయన దీక్ష విరమించినట్లుగా చెబుతున్నా.. మరోవైపు ఆయన దీక్ష విరమించలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో.. మీడియాలోనూ ముద్రగడ దీక్షకు సంబంధించిన వార్తల ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించటంతో ఆయన్ను అభిమానించే వారి ఆందోళన రెట్టింపు అవుతోంది. గతంలో ముద్రగడ దీక్ష చేసిన సమయంలో ఆయనకు సంబంధించిన అప్ డేట్స్ తరచూ వచ్చేవి. అయితే.. భావోద్వేగాల్ని టచ్ చేసే ఈ అంశంపై ఏపీ సర్కారు కఠినంగా వ్యవహరించటం.. ఈ విషయాన్ని అతిగా ప్రచారం చేసే వార్తా సంస్థల విషయంలో చట్టబద్ధంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తొందరపడి వార్తలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.

తాజాగా వెలువడుతున్న సమాచారం ప్రకారం.. ముద్రగడ చేస్తున్న దీక్ష తొమ్మిదో రోజుకు చేరుకుంది. ముద్రగడను దీక్ష విరమించేలా చేయటం కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావటం లేదు. కాపు జేఏసీ.. ప్రభుత్వ అధికారుల మధ్య సాగుతున్న చర్చలు ఫలప్రదం అవుతున్నట్లే కనిపించినా అలాంటిదేమీ జరగలేదు.

బుధవారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకూ ముద్రగడకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగు సెలైన్ సీసాలు పెట్టారు. తాను విశ్రాంతి తీసుకంటానని.. ప్రస్తుతానికి సెలైన్ పెట్టొద్దని చెప్పటంతో వైద్యులు ఆయనకు పెట్టలేదని చెబుతున్నారు. గురువారం మూత్రపరీక్షకు సహకరించిన ముద్రగడ తర్వాత మాత్రం సెలైన్లు వద్దని చెప్పారు. తుని విధ్వంసంలో పాలు పంచుకున్నారన్న ఆరోపణల మీద అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేయాలని దీక్ష చేస్తున్న ముద్రగడ.. ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆయన మూత్రంలో కీటోన్ బాడీస్ పెరుగుతున్నట్లుగా వైద్యులు పేర్కొంటున్నారు. వీటి పెరుగుదల మరింత పెరిగితే ప్రమాదకరమని వెంటనే వైద్యం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే.. ముద్రగడ తాను చేస్తున్న దీక్షను విరమించేందుకు ససేమిరా అంటున్నారు. ప్రమాదకరన పరిస్థితికి ఆరోగ్యం చేరుకున్న పక్షంలో బలవంతంగా అయినా ఆయనకు వైద్యం చేసేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు ఆయన చేత దీక్ష విరమించేందుకు ఒప్పించాలన్న భావనలో అధికారులు ఉన్నారు. ఏతావాతా తేలేదేమంటే.. ముద్రగడ ఇప్పటికీ దీక్ష చేస్తున్నారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News