బందెల దొడ్లో ప‌శువుల్లా ఒకేచోట క‌ట్టేస్తారా బాబు?

Update: 2017-08-27 09:20 GMT
ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోని చంద్ర‌బాబు స‌ర్కారు తీరును నిర‌సిస్తూ పాద‌యాత్ర చేయాల‌ని త‌పిస్తున్న కాపు ఉద్య‌మనేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం తీవ్ర‌స్థాయిలో త‌ప్పు ప‌ట్టారు. గ‌తంలో పాద‌యాత్ర‌ను పోలీసుల సాయంతో అడ్డుకున్న బాబు స‌ర్కారుపై మండిప‌డ్డ ఆయ‌న‌.. తాజాగా ఈ రోజు (ఆదివారం) మ‌రోసారి పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్టారు. అయితే.. ముద్ర‌గ‌డ పాద‌యాత్ర‌ను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సంద‌ర్భంగా త‌న నివాస‌మైన కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా బాబు తీరుపై ప‌దునైన విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధించారు. పాద‌యాత్ర‌ను అడ్డుకొని త‌మ‌ను బందెల దొడ్లో ప‌శువుల మాదిరి ఒకే చోట క‌ట్టేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసిన ముద్ర‌గ‌డ‌.. త‌మ ప్ర‌య‌త్నాల్ని పోలీసులు అడ్డుకుంటున్నార‌న్నారు. ఈసారి పాద‌యాత్ర‌కు సంబంధించిన స‌మాచారాన్ని.. రూట్ మ్యాప్ ను ప్ర‌భుత్వానికి పంపినా.. అడ్డుకోవ‌టం దుర్మార్గ‌మ‌న్నారు. తానేం పాపం చేశానో చెప్పాల‌ని చంద్ర‌బాబును నిల‌దీశారు ముద్ర‌గ‌డ‌.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై దండ‌యాత్ర చేసేంత ధైర్యం.. ద‌మ్ము త‌మ‌కు లేవ‌ని.. అన‌వ‌స‌రంగా పాద‌యాత్ర‌పై ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో తెలీటం లేద‌న్నారు. తానెందుకు న‌డ‌వ‌కూడ‌దో ఎవ‌రూ చెప్ప‌టం లేద‌ని.. ఇక్క‌డేమైనా బ్రిటీష్ పాల‌న సాగుతుందా? ఇంత నిర్బందం ఏమిటి? ఇలా ఎంత‌కాలం?  స‌మాధానం చెప్పాల్సిందేన‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

"కాంగ్రెస్ ప్ర‌భుత్వం కాపుల‌కు ఏం చేసింద‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నిస్తున్నార‌ని.. మ‌రి.. మీరు.. మీ మామ‌గారు అధికారంలో ఉన్న 1995లో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు అమ‌లు చేయ‌లేదో స‌మాధానం చెప్పాల‌న్నారు. ముందు మీరు చేయాల్సింది ఎందుకు చేయ‌లేదో చెబితే.. మిగిలిన‌వి ఎందుకు చేయ‌లేదో నేను చెబుతా. మీరు ఇచ్చిన హామీని అమ‌లు చేయ‌టం లేదు. మా జాతిని చుల‌క‌న‌గా చూస్తున్నారు. నంద్యాల‌.. కాకినాడ‌లో కులాల పేరుతో చేసిందేమిటి. మీ ఓట్ల కోసం.. అధికారం కోసం.. కులాల్ని అడ్డుగా పెట్టుకొని లేనిపోని ఆశ‌లు క‌ల్పిస్తున్నారే. కులాల పేరుతో రోడ్డు మీద‌కు రావ‌టానికి మీరే కార‌ణం" అని ముద్ర‌గ‌డ విమ‌ర్శించారు.

పోలీసుల‌తో పాల‌న చేయాల‌ని చూసిన ప్ర‌భుత్వాలేవీ మ‌నుగ‌డ సాగించ‌లేవ‌ని.. తామెంతో కాలంగా ఎదురు చూస్తున్నామ‌ని.. త‌మ జీవితాలు ఇలా ఎదురుచూసి విసిగిపోవాలా? అని ప్ర‌శ్నించారు. ఈ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల్ని అమ‌లు చేయ‌మ‌ని అడిగే హ‌క్కు కూడా లేదా?  మీ కొడుకు.. మీ మ‌న‌మ‌డు 2050 వ‌ర‌కు ప‌ద‌వుల్లో సాగాలా?  మేం మీ పాద‌సేవ చేయాలా?  మీకు బానిస‌ల్లా ఉండాలా?  మా జాతికి ఇంకా స్వ‌తంత్రం రాలేద‌ని మీరు భావిస్తున్నా.. మేం వేరే దేశం నుంచి వ‌చ్చామ‌ని ఓ కాగితం రాసిస్తే.. మేం రోడ్ల మీద‌కు రామ‌ని చెప్పారు. దేశంలో అన్ని కులాల‌కు స్వ‌తంత్రం వ‌చ్చినా త‌మ‌కు మాత్రం ఇంకా రాలేద‌ని తాము భావిస్తున్న‌ట్లు చెప్పారు.
Tags:    

Similar News