ప‌వ‌న్ వ‌స్తానంటే ముద్ర‌గ‌డ వ‌ద్ద‌న్నారా?

Update: 2019-04-02 09:01 GMT
రాజ‌కీయాల‌కు దూరంగా.. ఉద్య‌మ నేత‌గా ఏపీలో ఎవ‌రైనా నేత ఉన్నారా? అంటే.. వెంట‌నే గుర్తుకు వ‌చ్చే పేరు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం. కాపుల్ని బీసీల్లో చేర్చాలంటూ  ఆయ‌న న‌డిపిన ఉద్య‌మం ఎంత సంచ‌ల‌నంగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. కాపుల్లో మంచి ప‌ట్టున్న నాయ‌కుడిగా.. ఆత్మాభిమానం ఎక్కువగా ఉండే నేత‌గా ఆయ‌న‌కు పేరుంది.

అలాంటి ముద్ర‌గ‌డ‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌ల‌వాల‌ని భావించిన‌ట్లుగా తెలుస్తోంది. ముద్ర‌గ‌డ‌తో భేటీ కావటం ద్వారా రాజ‌కీయ ప్ర‌యోజ‌నంతో పాటు.. భారీ ఓటు బ్యాంకును త‌న‌వైపున‌కు తిప్పుకునే వ్యూహాన్ని ప‌వ‌న్ వేస్తే.. దాన్ని ముద్ర‌గ‌డ సైలెంట్ గా తిప్పికొట్టిన‌ట్లుగా చెబుతున్నారు.

తాను నేరుగా రావాల‌నుకున్నాన‌ని.. వ‌చ్చి క‌లుస్తాన‌ని ముద్ర‌గ‌డ‌ను ప‌వ‌న్ కోర‌గా.. ఇప్పుడు వ‌ద్ద‌ని.. ఎన్నిక‌ల త‌ర్వాత వ‌చ్చి క‌ల‌వొచ్చంటూ సున్నితంగా నో చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఎన్నిక‌ల్లో తాను కానీ త‌న కొడుకు కానీ పోటీ చేయ‌టం లేద‌ని.. అందుకే రాజ‌కీయాల్ని క‌లుగ‌జేసుకోవ‌టం త‌మ‌కు ఇష్టం లేద‌ని చెప్పిన‌ట్లుగా స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ మౌనంగా ఉన్నార‌ని.. ఒక రోజు త‌ర్వాత మ‌ళ్లీ మ‌రోసారి ముద్ర‌గ‌డ‌కు ఫోన్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

ఈసారి ముద్ర‌గ‌డ స‌తీమ‌ణి ఆరోగ్యం గురించి వాక‌బు చేసి.. ఆమెను ప‌రామ‌ర్శించేందుకు తానురావాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.  ఆ సంద‌ర్భంలోనూ ప‌వ‌న్ ను రావొద్దంటూ ముద్ర‌గ‌డ చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. ఎన్నిక‌ల వేళ టికెట్ల పంపిణీలో భాగంగా పిఠాపురం సీటును టీడీపీ అభ్య‌ర్థిగా ముద్ర‌గ‌డ‌కు ఇవ్వాల‌ని బాబు భావించినా ఆయ‌న ఒప్పుకోలేద‌ని చెబుతారు. కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో బాబు అనుస‌రించిన తీరుపైనా.. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రించిన వైనం పైనా ముద్ర‌గ‌డ ఇప్ప‌టికి గుర్రుగా ఉన్న‌ట్లు చెబుతారు. మొత్తానికి తాను వ‌స్తాన‌ని రెండుసార్లు కోరినా ముద్ర‌గ‌డ నో అన‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


Tags:    

Similar News