దీక్షలతో దారుణాల్ని బ్యాలెన్స్ చేయొచ్చా?

Update: 2016-06-22 18:12 GMT
ముద్రగడ దీక్షలోని భావోద్వేగాల్ని పక్కన పెట్టేద్దాం. భయాల్ని విడిచి పెట్టేద్దాం. పక్షపాతాల్ని వదిలపెట్టేద్దాం. ఉన్నది ఉన్నట్లుగా.. నిజాయితీగా మాట్లాడుకుందాం. ఎందుకంటే.. తామరాకు మీద నీటిబొట్టలా ఉండాల్సిన మీడియాలో మార్పులు వచ్చేశాయి. ప్రతిఒక్కరిలో భయం పెరిగిపోతోంది. నిజానికి ఇదో దురదృష్టకరమైన పరిణామం. ఎందుకంటే.. ఈ రోజున్న భయాలు రేపొద్దున మరింత పెరుగుతాయే తప్పించి తగ్గవన్న విషయాన్ని మర్చిపోకూడదు. మీడియాకు భయం అన్నది ఉండకూడదు. ఎందుకంటే.. అది ప్రజల పక్షాన నిలవాలి. వారి కోసం ఆరాటపడాలి. తర.. తమ బేధాలు వదిలేయాలి. తమ్ముడు తన వాడైనా ధర్మాన్నే నమ్ముకున్న చందంగా మాట్లాడాలి.

న్యాయం ఎవరిదైతే వారి పక్షాన నిలవాలి. భావోద్వేగాల్ని తట్టి లేపే నేతల తీరుకు వెనక్కి తగ్గి.. నిజాన్ని చెప్పే విషయంలో తడబాటుకు గురి కాకూడదు. కానీ.. ఇలాంటివి ఈ మధ్యన మరింత పెరిగిపోయాయి. ఇంకా కచ్ఛితంగా చెప్పాలంటే మీడియాలో ఇలాంటి వైఖరి తెలంగాణ ఉద్యమం మలిదశలో మొదలైంది. దశాబ్దాలుగా సాగుతున్న పోరాటాన్ని ముగించాలని.. ‘ఇప్పుడు కాకుంటే మరెప్పటికి’ అన్నట్లుగా వ్యవహరించిన ఉద్యమ వ్యూహకర్తలు ఒక బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీశారు. ప్రజల భావోద్వేగాల బూచిని చూపించి.. మీడియాను చెడుగుడు ఆడుకోవటం మొదలు పెట్టారు.

ఎవరైనా ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తే.. వారికి కులం.. ప్రాంతం.. రాజకీయం లాంటి ముద్రలతో పాటు ద్రోహి అన్న బిరుదు తగిలించే ప్రయత్నం చేశారు. చూస్తూ చూస్తూ అంత పెద్ద ముద్రను వేయించుకునేందుకు మొనగాడు లాంటి మీడియా సంస్థలు సైతం భయపడిన పరిస్థితి. అంత ‘రిస్క్’ అవసరం లేదంటూ.. ప్రజల భావోద్వేగాలకు తగ్గట్లుగా ఉంటే సరిపోతుందని.. కనిపించేది మాత్రమే నిజమని.. ప్రజలు చూసే విషయాన్ని.. వారు చూసే కోణంలోనే చెప్పాలన్న కొత్త లాజిక్ ను బయటకు తీసి వార్తలు రాయటం మొదలైంది.

ఇది ఉద్యమంతో పాటు ముగిసిపోతే బాగుండేది. ఎందుకంటే.. తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో మంది చేసిన త్యాగాల ముందు ఈ వ్యూహం వల్ల జరిగే నష్టం తక్కువే. కానీ.. మీడియాను చెప్పు చేతల్లోకి తెచ్చుకునే ఫార్ములాను ఒకసారి అర్థం చేసుకున్న రాజకీయ పక్షాలు అంత త్వరగా తమ వదిలి పెట్టలేవు కదా? అందుకే.. అదే కంటిన్యూ అవుతోంది. అదే సమయంలో.. ఒకసారి భయపడితే చాలు.. ఇక ఎప్పుడైనా భయపడే అవకాశం ఉంటుంది. భయం అనే అనుభవం మెదడుకు పరిచయం కాకూడదు. ఒక్కసారి అయితే.. అదెంత ప్రమాదకరమన్న విషయం తెలుగు రాష్ట్రాల్లోని మీడియా సంస్థల వైఖరిని చూస్తే అర్థమవుతుంది.

ఇలాంటి ధోరణిని చూసిన కొమ్ములు తిరిగిన జాతీయ స్థాయి జర్నలిస్ట్ లు విస్మయాన్ని వ్యక్తం చేసే పరిస్థితి. మీడియా ఇంత భయం.. భయంగా కూడా పని చేస్తుందా? మీడియాను ఇంత సింఫుల్ గా తమ చెప్పు చేతుల్లోకి తీసుకోవచ్చా? అంటూ ఆశ్చర్యపోతున్న వారి జాబితాలో మీడియాకు చెందిన ప్రముఖులతో పాటు.. కొందరు జాతీయనేతలు సైతం విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మీడియాను తమ చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవటం ఏ ఒకరిద్దరికి మాత్రమే కాదని.. చాలామందికే ఉందన్న విషయం తాజాగా ముద్రగడ ఎపిసోడ్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

ఇక్కడ ముద్రగడను వ్యతిరేకించటం లేదన్నది మర్చిపోకూడదు. ముద్రగడ విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే.. మొనగాడు లాంటోళ్లమంటూ జబ్బలు చరుచుకుంటూ పాత్రికేయాన్ని పరమ పవిత్రంగా చూస్తున్నామంటూ మాటలు చెప్పేవారు.. దమ్ముగా వ్యవహరిస్తామని గొప్పలు చెప్పుకునే వారు సైతం ముద్రగడ దీక్ష ఎపిసోడ్ లో చాలానే ప్రశ్నలు సంధించటం మర్చిపోయారు.

మీడియా తన ధర్మాన్ని వదిలేసినా.. ఏపీలోని ప్రజలు.. మరి ముఖ్యంగా కాపులు నమ్మశక్యం కానంత సంయమననాన్ని ప్రదర్శించారని చెప్పాలి. దీక్ష సందర్భంగా కొద్ది మంది తప్పించి.. చాలామంది మౌనంగా ఉన్నారు. చూద్దామన్నట్లుగా వ్యవహరించారే కానీ అట్టే రియాక్ట్ కాకపోవటం గమనార్హం. దీనికి కారణం లేకపోలేదు. ముద్రగడ చేసిన తాజా దీక్ష ఎవరి కోసం? ఎందు కోసం? అన్న విషయాల్ని ప్రధాన మీడియా సంస్థలు పెద్దగా ప్రస్తావించకున్నా.. సాదాసీదా జనాల మనసుల్లో కావటమే. తుని విధ్వంసానికి పాల్పడిన వారిని వదిలిపెట్టాలన్న డిమాండ్ తో ముద్రగడ దీక్ష చేయటాన్ని ప్రజలు బాగా గుర్తించారన్న విషయాన్ని మర్చిపోకూడదు.

తుని విధ్వంసాన్ని మనసున్న ఎవరూ సమర్థించరు. అసలు ఒప్పుకోరు కూడా. ఒక్కసారి ఊహించుకోండి. నాడు తగలబెట్టిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లో మన అమ్మ కానీ భార్య కానీ చెల్లులు కానీ.. అన్న కానీ.. మామగారు కానీ ఉండి ఉంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుంది? వందలాది మంది రైలును తగలబెట్టే ప్రయత్నంలో బిజీగా ఉండటమే కాదు.. తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న వేళ.. లగేజీని వదిలేసి ప్రాణభయంతో పరుగులు పెడుతున్న పరిస్థితి ఒక ఎత్తు అయితే.. రత్నాచల్ రైలు దగ్థం చేసిన తర్వాత.. తుని పట్టణ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో చోటు చేసుకున్న విధ్వంసం చూసిన తుని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు.

మరి.. అంతటి దారుణానికి బాధ్యులైన వారు ఎవరైనా విడిచి పెట్టాలా? వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం లేదా? ఎంత ఉద్యమం అయితే మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరించొచ్చా? దశాబ్దాల పాటు జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఏ రోజైనా.. ఇంత భారీ విధ్వంసం జరిగిందా? ఉద్యమ నేతలకు గురువు లాంటి కేసీఆర్ హింసను ఎప్పుడూ ఎందుకు సమర్థించలేదు? తన ఉద్యమంలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చారే కానీ.. హింసతో భయాన్ని కలగజేయలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. అదే సమయంలో ఎక్కడైనా చిన్న చిన్న ఇష్యూలై.. పోలీసులు వారిపైచర్యలు తీసుకుంటే.. వారిని వదిలిపెట్టాలని డిమాండ్ చేసే వారే కానీ.. వారిని విడిచి పెట్టేవరకూ పచ్చినీళ్లుకూడా ముట్టుకోనని దీక్షలు చేయలేదు. ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచలేదు. సమాజంలో ఉద్రికత్తలు పెరిగే అవకాశం ఇవ్వలేదు.

కానీ.. ముద్రగడ ఎపిసోడ్ అందుకు భిన్నం. ఆయన దీక్ష చేసే సమయంలో పురుగుల మందు డబ్బా చేతిలో పట్టుకొని.. తన దగ్గరకు వస్తే చాలు పురుగుల మందు తాగి చనిపోతానంటూ బెదిరించటాన్ని మర్చిపోకూడదు. ఆయన్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించిన తర్వాత.. ఆసుపత్రి చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా.. ఆసుపత్రిలో ఆయనకు వైద్యం చేసే సమయంలో.. తనకు వైద్యం చేయటానికి దగ్గరకు వస్తున్న వైద్యుల్ని దగ్గరకు రావొద్దంటూ తన తలను గోడకు.. మంచం రాడ్ కు కొట్టుకోవటం.. ఆ విజువల్స్ బయటకు రావటం వెనుక అర్థం ఏమిటి? ఇలాంటి వాటిని ఎవరు ప్రశ్నించరు. ఇదేం వైఖరి అని తప్పు పట్టరు. తప్పు పడితే తమ మీద కుల వ్యతిరేక ముద్ర వేస్తారన్న భయం. భావోద్వేగాల బంధనంలో చిక్కుకుపోతామన్న సంశయం.

ముద్రగడ దీక్షకు బదులుగా ఏం జరిగింది? అన్న ప్రశ్న వేసుకుంటే... వేలాది మంది ప్రజల్నితమ విధ్వంసంతో వణుకు పుట్టించిన వ్యక్తుల్ని వ్యవస్థ బెయిల్ చ్చి విడిచి పెట్టాల్సి వచ్చింది. ఇవాళ విడిచిపెట్టి రేపొద్దున అదుపులోకి తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే.. ఒకవేళ రేపొద్దున అదుపులోకి తీసుకున్నా ముద్రగడ ఇదే తరహా దీక్ష చేయరన్న గ్యారెంటీ ఏమీ ఉండదు. ముద్రగడ దీక్షను ఎలాంటి సర్ ప్రైజస్ లేకుండా ముగిసేలా చేయటానికి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్.. ఎస్పీలతో సహా మిగిలిన ఉన్నతాధికారులు ఎంతగా శ్రమించారో.. ఎన్ని నిద్ర లేని రాత్రులతో గడిచారో.. తమ తప్పులు లేకున్నా.. ముఖ్యనేత నోటి నుంచి తిట్లు కాచారో కొద్దిమంది మీడియా మిత్రులకు మాత్రమే తెలుసు.

ఎందుకిలాంటి పరిస్థితి అంటే భావోద్వేగాలకు వ్యవస్థలు భయపడిపోవటమే కారణంగా చెప్పాలి. ఇవాళ తుని విధ్వంసకారుల విషయంలో వదిలేశారు సరే.. రేపొద్దున ఏదైనా భావోద్వేగ అంశంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించినా.. చట్టం చర్యలు తీసుకోరా? ఒకవేళ తీసుకునే ప్రయత్నం చేస్తే.. అందుకు కౌంటర్ గా ఆమరణ దీక్ష చేసి భావోద్వేగాల్ని రెచ్చగొట్టేలా చేస్తే తప్పుచేసిన వాళ్లను వదిలేస్తారా? అంటే.. భావోద్వేగాలు చట్టానికి అతీతమైనవా..? అందరూ ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఆలోచించే పనిలో భాగంగా దయచేసి భావోద్వేగాలకు మాత్రం గురి కాకండి. ఇప్పుడదే ప్రజలకు శత్రువన్న విషయాన్ని మర్చిపోవద్దు బాస్.
Tags:    

Similar News