కరోనా వేళ... రిలయన్స్ సరికొత్త సాయం

Update: 2020-03-23 14:18 GMT
ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారిపై పోరు సాగించేందుకు ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా ముందుకు వస్తున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు సరికొత్త ప్రణాళికలు రచిస్తుంటే.. .వాటి అమలుకు తాము కూడా తమ వంతు సాయం అందజేస్తామని ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే వేదాంత రీజెన్సీస్ సంస్థ అధినేత అగర్వాల్ రూ.100 కోట్ల సాయాన్ని ప్రకటించగా... వ్యాపారంలోనే కాకుండా సాయంలోనూ తనది కొత్త ట్రెండేనంటూ ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కూడా సరికొత్త సాయాన్ని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు.

అయినా ముఖేశ్ అంబానీ ప్రకటించిన సాయం ఏమిటంటే... ఆయన కరోనా కట్టడికి నేరుగా నిధులేమీ ఇవ్వలేదు. అలాగని ఊరికే మాటలు కూడా చెప్పలేదు. కరోనా బాధితులను ఆసుపత్రులకు తరలించే వాహనాలు (అంబులెన్స్ లు అయినా, లేదంటే ఇతర వాహనాలు అయినా ఫరవా లేదు), రోగుల చికిత్స కోసం అవసరమయ్యే పరికరాలను తరలించే వాహనాలకు కూడా తమ రిలయన్స్ పెట్రోల్ పంపుల్లో ఉచితంగా ఇంధనాన్ని అందజేస్తారట. అది పెట్రోల్ అయినా, డీజిల్ అయినా కూడా ఈ వాహనాలకు ఉచితంగానే పోస్తారట. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి సోమవారం సాయంత్రం సరికొత్త ప్రకటన వెలువడింది.

ఇక్కడితోనే తన పని అయిపోయింన్నట్లుగా వ్యవహరించని ముఖేశ్ అంబానీ...రిలయన్స్ సంస్థల్లో పని చేసే కాంట్రాక్టు - టెంపరరీ వర్కర్స్ అందరికి జీతాలు - వేతనాలు చెల్లిస్తామని.. కరోనా వైరస్ సృష్టించిన ఈ క్రైసిస్ లో ఉద్యోగులు విధి నిర్వహణకు రాకపోయినా కూడా వారికి వేతనాలు చెల్లిస్తామని ప్రకటించారు. దేశంలోని పలు నగరాలలో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తామని వెల్లడించింది రిలయన్స్ సంస్థ. అదే సమయంలో ముఖానికి ధరించే మాస్కుల తయారీని మార్చ్ 24 నుంచి పెంచుతామని - ఒక్కో రోజుకు లక్ష మేరకు అదనంగా మాస్కులను ఉత్పత్తి చేస్తామని రిలయన్స్ సంస్థ వెల్లడించింది.


Tags:    

Similar News