మ‌ల్టీప్లెక్సుల్లో దోపిడీకి కేంద్రం అడ్డుక‌ట్ట‌!

Update: 2017-06-30 10:36 GMT
స‌ర‌దాగా వీకెండ్‌లో మ‌ల్టీప్లెక్స్‌లో సినిమా చూద్దామంటే స‌గ‌టు ప్రేక్ష‌కుడికి ప‌ట్ట‌ప‌గ‌లే క‌నిపిస్తాయి. అక్క‌డ ల‌భించే స్నాక్స్‌, వాట‌ర్ బాటిల్స్, కూల్‌డ్రింక్స్ ధ‌ర‌లు చూసి క‌ళ్లు బైర్లు క‌మ్ముతాయి. అయితే, ఇక‌పై ఈ ధ‌ర‌ల దోపిడీ నుంచి సామాన్యుడికి ఊర‌ట ల‌భించ‌నుంది. ఏ వస్తువుకూ రెండు ఎంఆర్పీ ధరలు ఉండ‌కుండా కేంద్ర ప్ర‌భుత్వం చ‌ట్ట స‌వ‌ర‌ణ చేసింది.  జనవరి 1 నుంచి ఈ చట్టం అమ‌లులోకి రానుంది.

సాధారణంగా మార్కెట్లో రూ. 20కి లభించే వాటర్ బాటిల్ ను...మల్టీప్లెక్సుల్లో రూ. 50, విమానాల్లో రూ. 100 వరకూ  ధ‌ర చెల్లించి కొనాల్సి వ‌స్తోంది. ఇలా రెండు ర‌కాల ఎంఆర్పీ ధ‌ర‌ల‌లో ఉన్న వ్యత్యాసాలపై కేంద్రం అనేక విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటుంది. దీంతో, కేంద్రం ఎట్టకేలకు లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) 2011 నాటి చట్టానికి సవరణ‌లు చేసింది. ఆ స‌వ‌ర‌ణ‌ల‌ను కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఆమోదించారు.

ఈ చ‌ట్టం అమ‌లులోకి వ‌స్తే సినిమా హాల్స్, మాల్స్, మల్టీ ప్లెక్సులు, ఎయిర్ పోర్టుల్లో విచ్చ‌ల‌విడి రేట్ల‌కు అడ్డుక‌ట్ట ప‌డుతుంది. ఇక మారిన నిబంధనల్లో భాగంగా, ఈ-కామర్స్ ప్లాట్ ఫాంపై విక్రయాలు జరిగే అన్ని ఉత్పత్తులపైనా రిటైల్ ధరలను ముద్రించడం తప్పనిసరి.

ఈ ప్ర‌కారం కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల శాఖ అధికార ప్రకటన వెలువరించింది. వినియోగదారుల కోసమే చట్ట సవరణ చేశామని ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక ప్రొడక్టులపై ఉండే డిక్లరేషన్ అక్షరాల సైజు కంటితో చదివేంత పెద్దవిగా ఉండాలని కూడా సవరణలో చేర్చినట్టు పేర్కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News