ముంబయి మహానగరానికి కొత్త పీడగా మిస్టరీ వాసనలు

Update: 2020-06-08 04:30 GMT
మాయాదారిరోగంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ముంబయి ప్రజలకు ఇప్పుడో కొత్త సమస్య వచ్చి పడింది. శనివారం సాయంత్రం నుంచి అదే పనిగా నగరంలోని పలు ప్రాంతాల్లో వస్తున్న కొత్త వాసనలు దడ పుట్టిస్తున్నాయి. ఈ వాసనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? కారణం ఏమిటన్నది అంతు చిక్కట్లేదు. దీంతో.. అధికారులు సైతం వాసనల మూలాల్ని కనుగొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కటం లేదు.

నగరంలోని పలుప్రాంతాల్లో భరించటం కష్టంగా ఉన్న చెడు వాసనలు వస్తున్నట్లుగా పెద్ద ఎత్తున కంప్లైంట్లు వస్తున్నాయి. చెంబూర్.. ఘాట్కోవర్.. అంధేరీ.. ంకజూర్ మార్గ్.. విఖ్రోలీ తదితర ప్రాంతాల్లో ఈ వాసనల ఘాటు ఎక్కువగా ఉంది. దీంతో రంగంలోకి దిగిన ఎన్ డీఆర్ ఎఫ్ టీం ఈ వాసనల అంతు చూసే ప్రయత్నం చేసింది. అయినా ఫలితం దక్కలేదు. తొలుత గ్యాస్ లీక్ అని భావించినా.. అది తప్పన్నది తేల్చారు.

ఈ వాసనల లెక్క తేల్చేందుకు వాసనల్ని గుర్తించే హజ్ మత్ వాహనాన్ని రంగంలోకి దించారు. రసాయనాల్ని పసిగట్టి.. దాన్ని నియంత్రించే లక్షణం ఈ హజ్ మత్ వాహనాలకు ఉంటుంది. ముంబయిలోని పారిశ్రామిక వాడల్లో ఈ వాహనాల్ని ఉంచి.. వాసనల మూలాల్ని కనుగొనే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. తాజా పరిణామాల నేపథ్యంలో పెట్రోలియం కార్పొరేషన్లు.. గ్యాస్ కంపెనీలను అలెర్టు చేశారు. అయినప్పటికీ చెడు వాసనలు ఎక్కడ నుంచి వస్తున్నాయన్నది గుర్తించలేక పోతున్నారు.

దీంతో.. ఈ వాసనల మీద ముంబయి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వివిధ పద్దతుల్లో పరీక్షలు జరిపిన అధికారాలు.. ఇవేమీ గ్యాస్ వాసనలు అయితే కావని తేల్చారు. అదే సమయంలో వాసనల మూలాల్ని గుర్తించలేకపోయారు. ఇదిలా ఉంటే.. గత ఏడాది కూడా ఇదే తరహాలో వాసనలు వచ్చాయని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మరి.. దీని మూలం ఏమిటన్నది ముంబయి నగర అధికారులకు పెద్ద టాస్కుగా మారిందిప్పుడు.
Tags:    

Similar News