మోడీ..హిట్ల‌ర్ ఒక‌టే అంటున్న మ‌హిళా నేత‌

Update: 2015-07-20 15:25 GMT
ప్రధానమంత్రి నరేంద్ర‌మోడీని జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో స‌మాన‌మ‌ట‌. అధికారం అంతా ఒక‌రి చేతిలోనే కేంద్రీకృత‌మై ఉన్న‌ట్లున్న మోడీ పాల‌న‌కు...హిట్ల‌ర్ ఏలుబ‌డి పెద్ద‌గా తేడా ఏం లేదట‌. ఈ మాట అన్న‌ది ఏ కాంగ్రెస్ నాయ‌కులో లేక మోడీ అంటే విరుచుకుప‌డే లెఫ్ట్ నాయ‌కులో కాదు. బీజేపీతో మిత్ర‌ప‌క్షంగా ఉన్న శివ‌సేన పార్టీ నాయ‌కులు కావ‌డం విశేషం.

ముంబై మేయర్, శివసేన నాయకురాలు స్నేహాళ్ అంబేకర్ మోడీని జ‌ర్మ‌నీ నియంతతో  పోల్చారు. తాజాగా ఆమె ఓ ప‌త్రిక‌కు ఇంటర్వ్యూ ఇస్తూ మోడీని పొగుడుతూనే చురకలేశారు. తన పని తని చేసుకుంటూ పోయే మోడీని ప్రశంసించకుండా ఉండలేనని...అయితే, కొంత వరకు ఆ పాలన హిట్లరు ఏలుబ‌డిని గుర్తుకు తెస్తుందని చెప్పారు. అధికారం అంతా ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకృతమైతే ఇలాగే అనిపిస్తుంద‌ని ఆమె వ్యాఖ్యానించారు.

ముంబయి మొదటి దళిత మేయర్ అయిన స్నేహాల్ అంబేకర్ శివ‌సేన‌లో ద‌ళిత నాయ‌కురాలిగా ఖ్యాతిని పొందారు. ఈ క్ర‌మంలో పార్టీలో యాక్టివ్‌గా ప‌నిచేయ‌డ‌మే కాకుండా దేశ ఆర్థిక రాజ‌ధాని అయిన ముంబైను పాలిస్తున్న బృహ‌న్ ముంబై కార్పొరేష‌న్‌కు చైర్‌ ప‌ర్సన్‌ గా ఎంపిక‌య్యారు. తాజాగా ఆమె ప్ర‌ధాన‌మంత్రి పాల‌న‌ను పోల్చి మ‌రోమారు వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు.
Tags:    

Similar News