తెలుగు తమ్ముళ్లకు ఇదేం దిశానిర్దేశం బాబు?

Update: 2021-02-24 04:33 GMT
మౌనంగా ఉండాల్సిన వేళలో మాట్లాడటం.. శ్రుతి మించి రాగాన పడినట్లుగా ఉన్న వైనం చూస్తే.. తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో దారుణ పరాభవం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు కుతకుతలాడిపోతున్నారు. ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ ఏపీ అధికారపక్షంపై తనకున్న ఏహ్య భావాన్ని దాచుకోవటానికి ఏ మాత్రం  ఇష్టపడటం లేదు. ప్రత్యర్థి పార్టీలను పొగడమని చెప్పటం లేదు కానీ.. చేసే వ్యాఖ్యలు బాధ్యతతో కూడుకొని ఉండాలి కదా? కానీ.. అవేమీ లేకుండా ఇష్టారాజ్యంగా మాటలు అనేయటమే లక్ష్యంగా బాబు తీరు ఉంది.

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన తీవ్రమైన వ్యాఖ్యల్ని సంధిస్తున్నారు. తాజాగా సీఎం జగన్ ను ఆర్థిక ఉగ్రవాదిగా అభివర్ణించారు. ఆయన ప్రజల్ని ఎలా శాసిస్తున్నారో చూస్తున్నామంటూనే.. దాని నుంచి బయటపడాలంటే రాజకీయ చైతన్యం అవసరమని పేర్కొంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలు ఇస్తున్న తీర్పును గౌరవించకుండా ఆటవికంగా వ్యవహరిస్తున్నట్లుగా మండిపడ్డారు.

పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఏపీ అధికారపక్షం జీర్ణించుకోలేకపోతుందని ఆక్షేపించిన ఆయన.. వైసీపీకి కొందరు అధికారులు అండగా నిలిచి ఏకపక్షంగా వ్యవహరించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటి వారిపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా కనబర్చిన స్ఫూర్తినే పుర పోరు వేళలోనూ చూపించాలన్నారు.

పంచాయితీలతో పోలిస్తే.. మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికలు తేడాగా ఉంటాయన్న చంద్రబాబు.. టీడీపీ తరఫున నామినేషన్లు వేసే వారిని వైసీపీ వారు ప్రలోభ పెట్టి.. భయపెట్టి తమవైపునకు తిప్పుకుంటారన్నారు. గ్రామాల్లో మాదిరి మున్సిపాలిటీల్లో అర్థరాత్రి ప్రజాభిప్రాయాన్ని మార్చటం సాధ్యం కాదన్నారు. టీడీపీ కార్యకర్తల జోలికి వచ్చే వారికి బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.

మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు.. మైండ్ గేమ్.. ప్రలోభాలు.. బలవంతపు ఒత్తిళ్లు ఉండవన్న చంద్రబాబు.. టీడీపీ కార్యకర్తల జోలికి వచ్చే వారికి బుద్ది చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని వార్నింగ్ ఇస్తున్నారు. త్వరలో జరిగే పురపోరులో నామినేషన్ ఉపసంహరించుకోవాలంటే అభ్యర్థి తప్పకుండా హాజరయ్యేలా మార్పులు చేయాలన్నారు.

ఇలా.. తమ్ముళ్లకు తనదైన హితబోధ చేసిన చంద్రబాబు.. చివరకు వచ్చేసరికి మాత్రం పంచాయితీ ఎన్నికల వేళ తమ్ముళ్లు చేసిన తప్పుల్ని రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఒకపక్క సీఎం జగన్ ను తిడుతూ.. మరోవైపు తీవ్రమైన ఆరోపణల్ని సంధిస్తూనే.. తమ్ముళ్లు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలన్న మాటల్ని చూస్తే.. కాస్తంత విస్మయానికి గురి చేయక మానదు. పురపోరుకు తెలుగు తమ్ముళ్లను సిద్ధం చేస్తున్న చంద్రబాబు మాటలు ప్రజలనే కాదు.. పార్టీ కార్యకర్తలను ప్రభావితం చేసేలా లేవన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News