ఇది విన్నారా...పోలీసు స్టేష‌నును జ‌ప్తు చేశారు

Update: 2016-05-07 10:15 GMT
త‌ప్పు చేసిన వారిని పోలీసులు పట్టుకుంటారు... నేర‌గాళ్లు నేరానికి వాడే సాధనాల‌ను, దొంగిలించిన ఆస్తుల‌ను పోలీసులు స్వాధీనం చేసుకుంటారు.. జ‌ప్తు చేస్తుంటారు. కానీ, విజ‌య‌వాడ‌లో అందుకు భిన్నంగా ఏకంగా పోలీసు స్టేష‌నే జ‌ప్తులోకి వెళ్లిపోయింది. విన‌డానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. అవును... లైసెన్సు లేకపోతే ఫైను - హెల్మెట్ పెట్టుకోక‌పోతే చ‌లానా - నో పార్కింగులో బండి పెడితే జ‌రిమానా క‌ట్టించుకునే పోలీసులు నిత్యం తాము విధులు నిర్వ‌హించే పోలీసు స్టేష‌న్ కు మాత్రం ఆస్తిప‌న్ను క‌ట్ట‌లేద‌ట‌. దీంతో విజ‌య‌వాడ కార్పొరేష‌న్ అధికారులు అక్క‌డి ఓ స్టేష‌న్ ను జ‌ప్తు చేసుకున్నారు.

విజయవాడలోని పాల ఫ్యాక్టరీ వద్ద నున్న రైల్వే పోలీస్ స్టేషన్ ను విజయవాడ నగరపాలక సంస్థ జప్తు చేసింది. ఏళ్లుగా ఆస్తిపన్ను చెల్లించకపోవడంతో అది కొండంతైకూర్చుందని, ఎన్నిసార్లు నోటీసులు పంపినా ఫలితం లేకపోవడంతో ముందుకు కదిలిన నగరపాల సంస్థ అధికారులు దానిని జప్తు చేశారు.

విజయవాడ నగరపాలక సంస్థకు రైల్వే పోలీస్ స్టేషన్ చెల్లించాల్సిన ఆస్తి పన్ను కోటి రూపాయలకు చేరింది. బ‌కాయిల వ‌సూళ్ల విష‌యంలో పైనుంచి ఆదేశాలు రావ‌డంతో విజ‌య‌వాడ కార్పొరేష‌న్ అధికారులు క‌దిలారు. భారీగా ఉన్న మొండి బకాయిలు వ‌సూలు చేసే క్ర‌మంలో పోలీస్ స్టేష‌న్ కు జ‌ప్తు చేసి దానికి సీలు వేశారు. దీంతో శ‌కునం చెప్పే బ‌ల్లి కుడితిలో ప‌డిన‌ట్ల‌యింది.
Tags:    

Similar News