టీఆర్ఎస్ ఆశలన్నీ అడియాసలేనా?

Update: 2015-05-23 04:16 GMT
కేంద్ర మంత్రి పదవులు చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలకు రోజురోజుకు కాంక్ష పెరిగిపోతుంటే....బీజేపీ నుంచి అందుకు తగ్గట్లు సిగ్నల్స్ రావడం లేదు. ఆఖరికి ప్రధానమంత్రి నరేంద్రమోడీని రంగంలోకి దించినా ఫలితం లేకపోయిందనే భావన టీఆర్ఎస్ వర్గాలకు కలిగేలా ఉంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆహ్వానిస్తే ఎన్డీయేలో చేరే విషయం పరిశీలిస్తామని టీఆర్‌ఎస్ ఎంపీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు  ప్రతికూలంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో బలమైన పోరుకు బీజేపీ శ్రీకారం చుడుతోందని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు దగ్గరయ్యే ప్రసక్తిలేదని ఢిల్లీలో విలేకరుల ఇష్టాగోష్టిలో మురళీధర్ రావు చెప్పారు. బీజేపీ ఆహ్వానిస్తే...అంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ....ఇతర పార్టీలను ఆహ్వానించే అవసరం తమకు లేదన్నారు. ఒంటరిగా ఎదిగే ప్రయత్నంలో తెలంగాణ నుంచి ఇంకో పార్టీని ఎన్డీయేలోకి తీసుకునే ఆలోచన లేదన్నారు. రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి సహకరించాలని అన్ని పార్టీలను కలుస్తుంటామని, ఆ క్రమంలో టీఆర్‌ఎస్‌తోనూ సంప్రదించడం జరుగుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ బలాన్ని నిరూపించుకోడానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముఖ్యమైనవని చెప్పారు. వాటి అనంతరం తాము పార్టీ నిర్మాణం, బలోపేతంపై పూర్తిస్థాయి శ్రద్ధ పెడతామని చెప్పారు.
Tags:    

Similar News