కొత్త స్ఫూర్తి: కాశీ విశ్వనాథ ఆలయానికి స్థలాన్ని అప్పగించిన ముస్లిం పెద్దలు

Update: 2021-07-24 03:47 GMT
పాత వివాదాలకు చెక్ చెప్పి కొత్త చరిత్ర దిశగా దేశంలో అడుగులు పడుతున్నాయి. సుదీర్ఘ కాలంగా నలుగుతున్న వివాదాలకు తెర దించుతూ ముస్లిం మత పెద్దలు ముందుకు రావటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. మత సామరస్యం దేశంలో ఎంతలా వెల్లి విరిస్తుందన్న దానికి నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెబుతున్నారు.

ఎంతోకాలంగా నడుస్తున్న వివాదానికి చెక్ చెప్పేలా ముస్లిం మతపెద్దలు తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. కాశీ విశ్వనాథ ఆలయానికి జ్ఞానవాపి మసీదుకు మధ్య భూ వివాదం ఉంది. అయితే.. దానికి ముగింపు పలుకుతూ 1700 చదరపు అడుగుల స్థలాన్ని ముస్లిం పెద్దలు కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టుకు అందించిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

వాస్తవానికి ఈ ఉదంతం ఇప్పటికి కోర్టులోనే నడుస్తోంది. అయితే.. ఆలయానికి భూమిని ఇవ్వాలని.. అందుకు ప్రతిగా భూమిని ఇస్తామన్న ప్రతిపాదనకు ముస్లిం మత పెద్దలు ముందుకు వచ్చి ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. కాశీ విశ్వనాధ ఆలయ కారిడార్ కోసం 1700 చదరపు అడుగుల స్థలాన్నిఇచ్చేందుకు మసీదు బోర్డు నిర్ణయం తీసుకున్నట్లుగా అంజుమన్ ఇంతజమియా మసీదు సంయుక్త కార్యదర్శి వాసిన్ వెల్లడించారు.

ఇందుకు ప్రతిగా కాశీ విశ్వనాథ ఆలయానికి దూరంగా ఉన్న 1000 చదరపు అడుగుల స్థలాన్నిముస్లింలకు ఇచ్చేందుకు ఆలయ పాలక వర్గం ఓకే చెప్పటంతో.. సుదర్ఘీ కాలంగా సాగుతున్న వివాదానికి పుల్ స్టాప్ పడినట్లైంది.

కాశీ విశ్వనాథ ఆలయానికి - అక్కడే ఉన్న మసీదుకు మధ్య వివాదం ఎప్పటి నుంచో నడుస్తోంది. కాశీ విశ్వనాథ ఆలయాన్ని మొగల్ పాలకుడు ఔరంగజేబు కూల్చివేసినట్లుగాచెబుతారు. అనంతరం ఆలయంస్థానంలో జ్ఞానవాపి మసీదు నిర్మాణం జరిగిందన్న వివాదం ఎప్పటి నుంచో ఉన్నదే. ఆలయం తరఫున విజయ్ శంకర్ రస్తోగి కోర్టును ఆశ్రయించారు. మసీదు నిర్మించిన స్థలం హిందువులకు చెందినదదన్నది ఆయన వాదన. ఇందుకు తగ్గట్లే పిటీషన్ దాఖలు చేశారు.

ఎంతోకాలంగా సాగుతున్న ఈ వివాదానికి సంబంధించి వారణాసి కోర్టు ఈ ఏడాది ప్రారంభంలో కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలోని మసీదు ప్రాంతంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు సర్వే జరిపేందుకు అనుమతులు ఇచ్చింది. మందిరం - మసీదు వివాదంపై విచారణ జరుపుతున్న కమిటీని ఏర్పాటు చేసింది. అయితే దీన్ని జ్ఞానవాపి మసీదు కమిటీ సవాలు చేసింది.

తాజాగా వివాదానికి పుల్ స్టాప్ పెడుతూ.. ముస్లిం మత పెద్దలు ముందుకు వచ్చి.. భూమిని ఆలయానికి ఇచ్చేందుకు ముందుకు రావటం.. అందుకు ప్రతిగా మసీదుకు ఆలయ భూమిని ఇవ్వటం లాంటి ఇచ్చిపుచ్చుకోవటాలతో సుదీర్ఘ వివాదం ఒకటి సమిసిపోయినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News