ఆలయంలో అర్చకుడికి ముస్లిం పింఛన్

Update: 2020-03-02 04:47 GMT
హిందూ అయినా ముస్లిం అయినా కోస్తే వచ్చేది ఎర్రటి రక్తమే.. మిక్స్ చేస్తే ఎవరి ఏ రక్తమో కూడా చెప్పలేం. భగవద్గీత అయినా ఖురాన్ అయినా శాంతినే ప్రబోధించింది. కానీ మన నేతలు, ప్రజలు మాత్రం కుల, మతాలుగా విడిపోయారు. కొట్టుకుంటున్నారు. ఉత్తరాధి ఢిల్లీలో జరిగిన దారుణ హింసలో 46మంది చనిపోయారు.

కానీ దక్షిణాదిలో ఆ ఒరవడి పెద్దగా లేదు. హిందూ, ముస్లింలు ఎంతలా కలిసిపోయారో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకోటి లేదు. ఏపీలో మతసామరస్యాన్ని చాటిచెప్పే గొప్ప ఘటన ఒకటి చోటుచేసుకుంది. అదిప్పుడు వైరల్ గా మారింది.

అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ వార్డు వలంటీర్ రజ్వీ సమీవుల్లా జగన్ సర్కారు తీసుకొచ్చిన ఇంటివద్దకే పింఛన్ పథకంలో భాగంగా ఆలయ అర్చకుడికి పింఛన్ అందజేయడానికి ఆయన ఇంటికి వెళ్లాడు. కానీ అర్చకుడు ఇంట్లో లేకపోవడంతో ఆయన పనిచేస్తోన్న ఆలయానికి వెళ్లారు. ముస్లిం అయినా కూడా చెప్పులు తీసేసి పద్ధతిగా ఆలయంలోకి వెళ్లి అర్చకుడి వేలిముద్రలను తీసుకొని పింఛన్ మొత్తం రూ.2250ను అందజేశారు.

ఈ ఫొటో ఇప్పుడు విపరీతంగా వైరల్ అయ్యింది. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం అంటూ కొట్టుకుంటున్న నిరసనకారులు ఈ మత సామరస్యం చూశాకైనా మారాలని కోరుతున్నారు. ఇలాంటి వాతావరణమే దేశానికి అవసరం అంటూ నినదిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ తీసుకొచ్చిన గ్రామ వలంటీర్ల వ్యవస్థను సైతం కొనియాడుతున్నారు.


Tags:    

Similar News