మొరటు వ్యాఖ్యల్లో సినిమాటిక్ ట్విస్ట్

Update: 2016-07-22 09:59 GMT
బీఎస్పీ అధినేత్రి మాయావతిని ఉద్దేశించి దారుణ వ్యాఖ్యలు చేసిన యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ పై బీజేపీ అధినాయకత్వం తీవ్రంగా పరిగణించి.. వాయువేగంతో ఆరేళ్లు పార్టీ నుంచి వేటు వేయటం తెలిసిందే. గతంలోపలువురు కమలనాథులు నోటికి పని చెప్పినా.. చూసీ చూడనట్లుగా వ్యవహరించే బీజేపీ అధికానాయకత్వం బీఎస్పీ అధినేత్రిపై పార్టీ ఉపాధ్యక్షుడు చేసిన వ్యాఖ్యల్ని మాత్రం సీరియస్ గా తీసుకుంది.

అతగాడి మొరటు వ్యాఖ్యలు దళిత ఓటు బ్యాంకును దెబ్బ తీసేలా ఉండటం.. కొద్దినెలల్లో వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మాత్రం కటువుగా వ్యవహరించకపోతే పార్టీకి నష్టం వాటిల్లుతుందన్న భావనతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారం సినిమాటిక్ మలుపు తీసుకోవటం ఆసక్తికరంగా మారింది.

మాయావతిపై మొరటు వ్యాఖ్యలు చేసిన మాజీ బీజేపీ నేత దయాశంకర్ సింగ్ సతీమణి స్వాతి సింగ్ తాజాగా మీడియా ముందుకు వచ్చారు. తనను బీఎస్పీ నేతలు.. కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేయటంతో తాను మానసికంగా తీవ్రంగా నలిగిపోతున్నట్లు ఆమె వ్యాఖ్యానించారు. అన్నింటికి మించి తమ పన్నెండేళ్ల కుమార్తె ఈ వ్యవహారంలో తీవ్ర ఆందోళనకు గురి అవుతుందంటూ కంటతడి పెట్టటం గమనార్హం. ఇదిలా ఉంటే.. స్వాతి ఆరోపణలపై మాయావతి స్పందించారు. తమ పార్టీ నేతలు.. కార్యకర్తలు ఎవరూ వేధించలేదని.. వారంతా తనపై చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా కలత చెందారని చెబుతున్నారు. మరి.. ఈ వ్యవహారం ఎటు తిరిగి ఎటువైపుకు వెళుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.       
Tags:    

Similar News