పార్టీ మారాడ‌ని అంత‌లా కామ్రేడ్స్ దుర్మార్గం

Update: 2018-02-10 06:34 GMT
ఒక వీడియో కేర‌ళ రాష్ట్రాన్ని ఊపేస్తోంది. రాజ‌కీయంగా తీవ్ర సంచ‌ల‌నంగా మారిన ఈ వీడియో ఇప్పుడక్క‌డ హాట్ టాపిక్ గా మారింది. నిత్యం నీతులు మాట్లాడే రాజ‌కీయ పార్టీల్లో క‌మ్యూనిస్టులు ముందుంటారు.అలాంటి పార్టీ తీరు ఎంత దారుణంగా ఉందో తెలిపే వీడియో ఒక‌టి ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది.

కేర‌ళ‌కు చెందిన ఒక బాలిక త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తూ.. సీపీఎం కార్య‌క‌ర్త‌ల కార‌ణంగా త‌మ కుటుంబానికి ముప్పు ఉంద‌ని ఆరోపిస్తోంది. రాజ‌కీయంగా పెను దుమారంగా మారిన ఈ వీడియో విష‌యానికి వ‌స్తే.. క‌స‌ర‌గాడ్ జిల్లాకు చెందిన సుకుమార‌న్ అనే వ్య‌క్తి ఇటీవ‌ల కాలం వ‌ర‌కూ సీపీఎం పార్టీలో ఉండేవాడు. అయితే.. పార్టీలో మంచి ప‌ద‌విని ఆశించిన అత‌గాడి కోర్కెను మ‌న్నించ‌క‌పోవ‌టంతో అత‌ను హ‌ర్ట్ అయ్యాడు.

దీంతో.. క‌మ్యూనిస్టుల‌ను వ‌దిలేసి బీజేపీలో చేరిపోయాడు. ఇక్క‌డితో ఈ ఇష్యూ క్లోజ్ అయితే బాగుండేది. కానీ.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించటం ఇప్పుడు పెద్ద ర‌చ్చ‌గా మారింది. స్థానికంగా మాంచి ప‌ట్టు ఉన్న నాయ‌కుడు పార్టీ నుంచి వెళ్లిపోవ‌టాన్ని కామ్రేడ్స్ స‌హించ‌లేక‌పోతున్నారు. దీంతో బెదిరింపుల ప‌ర్వానికి తెర తీశారు.

ఇదిలా ఉండ‌గా.. తాజాగా త‌న కుమార్తెను స్కూల్ నుంచి తీసుకొస్తున్న అత‌డ్ని ఆపిన ఐదుగురు సీపీఎం కార్య‌క‌ర్త‌లు అత‌డ్ని బెదిరించారు. పోలీసులు కూడా త‌మ‌నేం చేయ‌లేర‌ని.. తాము ఎవ‌రికీ భ‌య‌ప‌డే ర‌కం కాద‌ని.. కుటుంబం మొత్తాన్ని చంపేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. త‌న క‌ళ్ల ముందే త‌న తండ్రిని.. కుటుంబాన్ని చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన వారి గురించి తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న అశ్విని ఒక వీడియో తీసి.. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.

స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ఈ వీడియో వైర‌ల్ అయ్యింది. వీడియోలో ఆమె చెప్పిన వివ‌రాలు.. వ్య‌క్తం చేసిన ఆందోళ‌న రాజ‌కీయంగా పెను దుమారాన్ని రేపింది. మా కుటుంబాన్ని సీపీఎం కార్య‌క‌ర్త‌లు చంపేస్తారు.. మా కుటుంబాన్ని ర‌క్షించండి అంటూ వీడియోలో బాలిక వేడుకున్న వైనం ప‌లువురిని క‌దిలిస్తోంది. ఈ వీడియో సంచ‌ల‌నంగా మార‌టం.. సీపీఎం కార్య‌క‌ర్త‌ల తీరుపై ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌య్యేలా మార‌టంతో పార్టీ నేత‌లు రంగంలోకి దిగారు.

త‌మ కార్య‌క‌ర్త‌ల మీద చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని సీపీఎం నేత‌లు ఖండిస్తున్నారు. సీపీఎంలో సాధార‌ణ కార్య‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించేవాడ‌ని.. ఆ వ్య‌క్తి కాంగ్రెస్ త‌ర్వాత బీజేపీలో చేరాడ‌ని.. అంత చిన్న కార్య‌క‌ర్త‌ను బెదిరించాల్సిన అవ‌స‌రం ఏముంది? అంటూ సీపీఎం నేత‌లు కొట్టిపారేస్తున్నారు. ప‌బ్లిసిటీ కోస‌మే ఇలాంటి ప‌నులు చేస్తున్నాడంటూ మండిప‌డుతున్నారు.

మ‌రోవైపు ఈ వీడియోపై బీజేపీ రియాక్ట్ అయ్యింది. బెదిరింపుల‌పై సుకుమార‌న్ ఇచ్చిన ఫిర్యాదును న‌మోదు చేసి కేసు ఫైల్ చేయాల‌ని డిమాండ్ చేసింది. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేయ‌క త‌ప్ప‌లేదు. ఈ వ్య‌వ‌హారం అంత‌కంత‌కూ పెద్ద‌ది కావ‌టంతో ఈ వీడియో కేర‌ళ రాష్ట్ర ముఖ్య‌మంత్రి విజ‌య‌న్ వ‌ర‌కూ వెళ్లింది. దీనిపై విచారించి త‌న‌కు నివేదిక ఇవ్వాలంటూ డీజీపీని కోర‌టంతో ఈ ఇష్యూ ఇప్పుడు అంద‌రి దృష్టిని మ‌రింత‌గా ఆక‌ర్షిస్తోంది.
Tags:    

Similar News