ఐటీ దాడుల‌పై మైహోం క్లారిటీ ఇచ్చేసింది!

Update: 2019-07-07 05:33 GMT
అదిగో తోక అంటే ఇదిగో పులి అన్న చందంగా వార్త‌లు రావ‌టం ఈ మ‌ధ్య‌న ఎక్కువైంది. సోష‌ల్ మీడియా ఎంట్రీ త‌ర్వాత ఎవ‌రికి వారే వార్త‌లు సృష్టిస్తున్నారు. దీంతో ఏది నిజం?  ఏది అబ‌ద్ధ‌మ‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. ఇదిలా ఉంటే ప్ర‌ముఖుల‌కు సంబంధించిన చిన్న విష‌యం బ‌య‌ట‌కు పొక్కినా.. దానికి సంబంధించి ర‌క‌ర‌కాల వాద‌న‌లు.. వ్యాఖ్య‌ల‌తో వార్త‌లు రావ‌టంతో అస‌లు కంటే కొస‌రు ఎప్పుడు పెద్ద ఇబ్బందిగా మారింది.

తాజాగా నిర్మాణ రంగంలో తోపుగా చెప్పుకునే ప్ర‌ముఖ బిల్డ‌ర్ మైహోమ్ రామేశ్వ‌ర‌రావు వార్తల్లోకి రావ‌టం తెలిసిందే. గ‌తంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు అత్యంత స‌న్నిహితుడిగా.. అధ్యాత్మిక‌వేత్త‌గా మాత్ర‌మే వార్త‌ల్లో ఉండే ఆయ‌న‌.. టీవీ9 సొంతం చేసుకునే క్ర‌మంలో ఆయ‌న కొత్త కొత్త వార్త‌ల్లో త‌ర‌చూ క‌నిపిస్తున్నారు.

ఎప్పుడూ లేని విధంగా త‌న మీద మీడియాలో వ‌చ్చే వార్త‌ల‌కు వివ‌ర‌ణ ఇచ్చుకోవ‌టం ఎక్కువైంది. రెండు..మూడు రోజుల క్రితం హైహోం అధినేత రామేశ్వ‌ర‌రావు నివాసం మొద‌లుకొని మైహోం సంస్థ‌ల్లో ఆదాయ‌ప‌న్ను అధికారులు తనిఖీలు నిర్వ‌హించిన వైనం టీవీల్లో బ్రేకింగ్స్ రూపంలో.. ప‌త్రిక‌ల్లో సింగిల్ కాల‌మ్ ఐటెమ్ గా వ‌చ్చేసింది.

దీంతో మైహోం రామేశ్వ‌ర‌రావు మీద జ‌రిగిన ఐటీ దాడుల వార్త‌ను అచ్చేసే విష‌యంలో మొన‌గాడు మీడియా సంస్థ‌ల‌కు సైతం చెమ‌ట‌లు ప‌డ్డాయ‌న్న ప్ర‌చారం జ‌రిగింది.

ఇదిలా ఉంటే.. తాజాగా మ‌రోసారి ఐటీ శాఖ మ‌రోమారు త‌నిఖీలు చేస్తుంద‌ని.. మైహోంను ఫిక్స్ చేసేందుకు చాలానే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని.. తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్ర‌ధాని మోడీ టార్గెట్ చేసిన నేప‌థ్యంలో తాజా త‌నిఖీలు సాగుతున్న‌ట్లుగా చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ప్ర‌ధాన మీడియాలో వ‌చ్చే వార్త‌ల‌తో పోలిస్తే సోష‌ల్ మీడియాలో  పెడుతున్న పోస్టుల‌తో మైహోం రామేశ్వ‌ర్ కు మ‌హా త‌ల‌నొప్పిగా మారింద‌ని చెబుతున్నారు.

దీంతో.. ఈ ఇబ్బందిని అధిగ‌మించేందుకు త‌మ మీద జ‌రిగిన ఐటీ త‌నిఖీల మీద మైహోం క్లారిటీ ఇచ్చింది. తాము ప‌న్ను చ‌ట్టాల్ని.. నియంత్ర‌ణా సంస్థ‌ల నిబంధ‌న‌ల్ని తూచా త‌ప్ప‌కుండా పాటిస్తామ‌ని.. విలువ‌ల‌తో బిజినెస్ చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. కార్పొరేట్ గ‌వ‌ర్నెన్స్ నిబంధ‌న‌ల్ని పూర్తిస్థాయిలో పాటించ‌టం త‌మ సంస్థ‌కు అల‌వాటుగా మైహోం పేర్కొంది.

తాజాగా జ‌రుగుతున్న త‌నిఖీల వెనుక అస‌లు కార‌ణాన్ని చెప్పిన మైహోం.. బెంగ‌ళూరుకు చెందిన ఒక రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలో ఐటీ దాడులు జ‌రిగాయ‌ని.. స‌ద‌రు కంపెనీతో త‌మ‌కు టైఅప్ ఉండ‌టంతో త‌మ సంస్థ‌ల్లో కూడా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నార‌ని చెప్పారు.

అంతా బాగుంది కానీ.. అదే నిజ‌మైతే మైహోం అధినేత రామేశ్వ‌ర్ ఇంట్లో ఉద‌యం నుంచి రాత్రి పొద్దుపోయే వ‌ర‌కూ త‌నిఖీల మీద త‌నిఖీలు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉందా? అన్నది ప్ర‌శ్న‌గా మారింది. ఒక‌వేళ త‌నిఖీలు చేసినా.. రెండో రోజు కూడా కొన‌సాగ‌టం మీద క్లారిటీ ఇవ్వ‌టం మానేసి.. త‌మ సంస్థ విలువ‌ల‌తో బిజినెస్ చేస్తుంద‌న్న క‌వ‌రింగ్ మాట అస‌లు క్లారిటీని క‌ప్పేసింద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News