ఇవి చూసుకునే భాజపాకు కొమ్ములు వస్తున్నాయ్‌

Update: 2016-09-13 06:22 GMT
భారతీయ జనతా పార్టీ మీద ఎన్నో ఆశలతో... మోడీ ఏదో చేసేస్తాడన్న విశ్వాసంతో దేశ ప్రజలు కేంద్రంలో వారికి అధికారం అప్పగించారు. అయితే ఈ రెండున్నరేళ్లలో ఏం జరిగిందంటే.. అందరికీ ప్రశ్నలే తప్ప జవాబులు ఎవ్వరికీ దొరకడం లేదు. ఇలాంటి నేపథ్యంలో.. భాజపా పార్టీ పరంగా డీలా పడుతూ ఉండాలి.. కానీ వారేమో తమకు కొమ్ములు వస్తున్నట్లుగా మరింతగా చెలరేగిపోతున్నారు. ఏమిటీ వైపరీత్యం. రివర్సులో జరుగుతోందేమిటి? వారికి ఇంత అహంకారం ఎలా వస్తోంది. అనే అనుమానం ఎవ్వరికైనా కలుగక మానదు. అయితే.. సోషల్‌ మీడియా వంటి చోట్ల జరిగే కొన్ని సర్వేల్లో వెల్లడయ్యే జనాభిప్రాయాన్ని చూసుకుని, అదే బలంగా భావించుకుంటూ.. భాజపా కొమ్ములు మొలిచినట్లు ప్రవర్తిస్తున్నదని అర్థమవుతోంది.

తాజాగా మైవోట్‌ టుడే అనే సంస్థ సోషల్‌ మీడియాలో ఒక పోల్‌ నిర్వహించిందట. రేపు ఎన్నికలు నిర్వహిస్తే ఏ పార్టీకి ఓటు వేస్తారు? అనేది సబ్జెక్టు. 74 శాతం మంది భాజపాను ఎంచుకున్నారుట. 10 శాతం మంది ఆప్‌ కు - 9 శాతం మంది కాంగ్రెస్‌ కు ఓటు వేస్తాం అని చెప్పారుట. మొత్తం 56 వేల మంది వరకు ఓటింగ్‌ లో పాల్గొన్నారట. అయినా ఎన్నికల్లో 74 శాతం ఓట్‌ షేర్‌ అంటే అది మామూలు విషయం కాదు. మహా మహా కొమ్ములు తిరిగిన మొనగాడు నాయకులకు కూడా అంత ఓట్‌ షేర్‌ రాదు.

ఇది చూసుకుని భాజపా మురిసిపోతున్నట్లున్నది. మరింత అహంకారాన్ని ఆ పార్టీ అరువు తెచ్చుకుంటున్నట్లున్నది. అదే నిజమైతే గనుక.. వారు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. ఊరూ పేరూ లేని ఇలాంటి సంస్థలు నిర్వహించే ఆన్‌ లైన్‌ పోల్‌ లకు - వాస్తవంగా జనంలో  - క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అచేతన పాలన వల్ల యాతన పడుతూ ఉండే ప్రజల్లో ఉండే అభిప్రాయాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పార్టీలు ఓడితే అది జనం వల్ల జరుగుతుంది గానీ.. నెటిజన్ల వల్ల కాదు. ఆ సంగతిని భాజపా నాయకులు గుర్తుంచుకుని నేలమీదనే నడిస్తే వారికే మంచిది.
Tags:    

Similar News