పిల్లల్ని కాల్చొద్దు.. నన్నుకాల్చేయండి.. సంచలనంగా మారిన ఆ ఫోటో

Update: 2021-03-10 07:30 GMT
చిన్న దేశమైన మయన్మార్ లో సైనిక పాలకులు చేస్తున్న ఆరాచకాలు అన్ని ఇన్ని కావు. తమకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన వారిని అణగదొక్కేందుకు వారిని పిట్టల్ని కాల్చినట్లుగా కాల్చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. తమకు వ్యతిరేకంగా గళం విప్పిన వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న వైనం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చకు తెర తీసింది. ఇదిలా ఉండగా.. సైనిక నిర్బంధాలకు పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకుంటుంటే.. అలాంటి వాటిని నిర్దాక్షిణ్యంగా అణిచేసేలా అక్కడి సైనిక ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

ఇదిలా ఉంటే.. సైనికుల తీరును తప్పు పట్టటమే కాదు.. పిల్లలపై ప్రతాపం చూపేందుకు వచ్చిన సైనికులకు షాకిచ్చారో క్రైస్తవ సన్యాసిని. చిన్నారుల్ని కాల్చొద్దు.. అవసరమైతే నన్ను చంపండంటూ సైనికులకు అడ్డంగా మోకాళ్ల మీద నిలబడి.. ఆర్థిస్తున్న ఫోటో ఇప్పుడా దేశంలో పెను సంచలనంగా మారింది.

బౌద్ధులు అత్యధికంగా ఉండే ఆ దేశంలో ఇప్పుడీ ఫోటో హాట్ టాపిక్ గా మారింది. కచిన్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఒక ఘటనకు నిలువెత్తు సాక్ష్యమని చెబుతున్నారు. ఆందోళనకారుల్ని చెదరగొడుతున్న సైనికులు వెళ్లిపోవాలంటూ కేథలిక్ నన్ ఆన్ రోజు నుత్వాంగ్ కోరారు. సైనికులకు అడ్డుగా నిలిచి.. చర్యలు తీసుకునే ముందు తనను చంపేయాలని కోరటం.. ఆమె తీరుకు షాక్ తిన్న సైనికులు.. ఆమెకు చేతులు జోడించి.. తమకు దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్న చిత్రం ఇప్పుడక్కడ వైరల్ గా మారింది.
Tags:    

Similar News