మోడీ ‘రెండేళ్ల’కు జనం మాట ఇదేనంట

Update: 2016-06-29 04:49 GMT
ప్రధాని పదవిని చేపట్టిన నరేంద్ర మోడీ దూసుకెళ్లిపోతున్నట్లుగా పలువురు చెబుతారు. ఆయన పాలన మీద జనం పాజిటివ్ గా ఉన్నారని.. సంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లుగా వచ్చిన సర్వే ఫలితాలు చాలానే ఉన్నాయి. అయితే.. మోడీని ఓకే అన్నోళ్లలో చాలామందిలో ఆయనపై కొన్ని అసంతృప్తులు పెట్టుకున్నారన్న విషయం తాజాగా తేలింది. మోడీ కానీ ప్రధాని అయితే ఎన్నోమార్పులు వచ్చేస్తాయని ఫీల్ అయిన వారి ఆశలు నెరవేరలేదన్న విషయాన్ని తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

అది కూడా ఏ మీడియా సంస్థ నిర్వహించిందో కాకుండా.. మే26 నుంచి జూన్ 23 వరకూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వెబ్ సైట్ ఫలితం కావటం గమనార్హం. ‘మైగవర్నమెంట్’ వెబ్ సైట్ చేపట్టిన సర్వేలో మొత్తం 64లక్షల మంది ఆసక్తి ప్రదర్శించగా.. 2.68 లక్షల మంది సర్వేను పూర్తి చేశారు. మోడీ పాలన మీద సంధించిన 30 ప్రశ్నలకు సంబంధించిన ప్రజలు ఇచ్చిన సమాధానాల్ని చూస్తే..

మొత్తం సర్వేలో పాల్గొన్న వారిలో 76 శాతం మంది మోడీ విదేశాంగ విధానం బాగుందన్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా తన పదవీకాలంలోరెండోసారి భారత్ కు రావటం.. అది కూడా రిపబ్లిక్ డేకి అతిధిగా హాజరు కావటం లాంటి వాటికి ప్రజలు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. రైల్వేప్రయాణంలో ఇబ్బందుల్ని తగ్గించటంలో మోడీ సర్కారు సక్సస్ అయ్యిందని చెప్పటమే కాదు.. రైల్వేలను ఆధునికీకరించి మౌలిక వసతులను అభివృద్ధి చేయటంలో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు కృషిని 75 శాతం మంది మెచ్చుకున్నారు. ఇక.. మోడీ టీంలోని మరో మంత్రి నితిన్ గడ్కారీ పనితీరు బాగుందని 75 శాతంమంది చెప్పటం గమనార్హం.

మేకిన్ ఇండియాకు మంచి స్పందనే రాగా.. విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెలికి తీసి దేశానికి తీసుకొచ్చే విషయంలో మాత్రం అనుకున్నంత ఏమీ లేదని.. చేయాల్సింది చాలానే ఉందని 62 శాతం మంది పెదవి విరిచారు. ముద్ర యోజన..స్టార్టప్ఇండియా పథకాల అమలు బాగోలేదంటూ 65 శాతం మంది నిర్మోహమాటంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించటం.. ఆ విషయాన్ని ప్రభుత్వ వెబ్ సైట్ వెల్లడించటం విశేషంగానే చెప్పాలి.
Tags:    

Similar News