గుర్తున్నాయా...పాదయాత్ర హామీలు...?

Update: 2022-02-14 11:30 GMT
హామీలు ఇవ్వడానికి ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. నోటితో అలా  చెబితే సరిపోతుంది. దాన్నే ఆచరణలో పెట్టాలంటే మాత్రం చాలానే చేయాలి. ఏపీలో చూసుకుంటే ఎన్నో హామీలు ఇచ్చి జగన్ అధికారంలోకి వచ్చారు. వాటిలో అలవి కానీ హామీలు కూడా అనేకం ఉన్నాయని అంటారు. జగన్ పాదయాత్ర ద్వారా ఏపీ మొత్తాన్ని చుట్టేశారు. అలా ప్రతీ చోటా ప్రతీ వర్గానికి హామీలు ఇచ్చుకుంటూ పోయారు.

మరి వాటిలో ఏవి అమలవుతున్నాయి. ఎన్నింటిని జగన్ అమలు చేసి చూపిస్తున్నారు అంటే జవాబు ప్రతిపక్షాలే చెప్పాలి. ఇపుడు జనసేనను తీసుకుంటే వైసీపీ హామీలన్నీ గాలి మాటలే అంటోంది. ఆ పార్టీ  పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అయితే జగన్ పాలనను తూర్పారా పట్టారు. ఏపీలో వైసీపీ పాలన పూర్తిగా పాదయాత్రలో చేసిన హామీలకు భిన్నంగా సాగుతోంది అని ఘాటైన కామెంట్స్ చేశారు.

దానికి నిలువెత్తు ఉదాహరణ మత్య్సకారులకు వైసీపీ ఇచ్చిన హామీలు అని ఆయన ఉదహరించారు. మత్స్యకారులకు భరోసా కోసం ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయలు ఇస్తామని నాడు చెప్పిన జగన్ ఇపుడు కేవలం లక్ష మందికి మాత్రమే  దాన్ని అమలు చేస్తున్నారని నిందించారు. రెండు లక్షల మంది మత్య్సకారులకు లబ్ది చేకూర్చాల్సి ఉండగా సగం మాత్రమే హామీ నెరవేర్చి గాలికి వదిలేస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు

ఇక ప్రమాదంలో మరణించిన మత్య్సకారుల కుటుంబాలకు పది లక్షల రూపాయల దాకా బీమా ఇస్తామని నాడు జగన్ హామీ ఇచ్చారని, ఇపుడు ఒక్కరికైనా బీమా సొమ్ము ఇవ్వగలిగారా అని గద్దించారు. అలాగే డీజిల్ మీద ఇచ్చే సబ్సిడీ కూడా ఏ ఒక్క మత్య్సకారుడికీ సరిపోవడం లేదని ఆయన అన్నారు. హామీలు నాడు ఇవ్వడం కాదు, ఇపుడు మత్స్యకార  గ్రామాలలో జగన్ పర్యటిస్తే వాస్తవాలు ఆయనకే అర్ధమవుతాయని నాదెండ్ల సూచించడం విశేషం.

అదే సమయంలో మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి జనసేన పాటు పడుతుంది అని ఆయన స్పష్టం చేశారు. వారి అభ్యున్నతి కోసం తమ పార్టీ అండగా ఎపుడూ ఉంటుందని కూడా చెబుతున్నారు. మొత్తానికి అన్ని హామీలూ నెరవేర్చామని జబ్బలు చరచుకుంటున్న వైసీపీ నేతలకు నాదెండ్ల మనోహర్ ఇలా గాలి తీశేశారు అని అంటున్నారు. దీనికి ఫ్యాన్ పార్టీ నేతలు జవాబు ఏం చెబుతారో చూడాలి.


Tags:    

Similar News