నడిరోడ్డుపై సిగ్గొదిలేసిన అగ్రరాజ్యం!

Update: 2016-10-19 15:39 GMT
దాదాపు ప్రపంచం మొత్తానికి అమెరికా అంటే చిన్న విషయం కాదు - అదొక సంపన్న దేశం - ప్రపంచ దేశాలకు పెద్దన్న దానిముద్దు పేరు అగ్రరాజ్యం, చాలా దేశాల్లోని యువతీయువకులకు కలల రాజ్యం. అమెరికా అధ్యక్షుడు ఎక్కడికైనా వెళ్తే... అతడికి సంబందించిన అన్నీ ఒక ప్రత్యేక విమానంలో వస్తుంటాయి. ఆ అధ్యక్షుల వారు ఏదేశమైనా వెళ్తే... అక్కడ ఆ దేశపు ఆక్సిజన్ తప్ప మరేదీ అంటనీయరు. ఆ హడావిడి సంగతి కాసేపు పక్కనపెడితే... అమెరికావైపు ఎవరైనా కన్నెత్తి చూడాలంటే హడల్ - ఇంతలోనే ఐసిస్ భయం అమెరికాకు పట్టుకుంది. అమెరికా పూర్తి సెక్యూరిటీ ప్రాంతం. ప్రపంచలోని ఏ దేశ ప్రజలైనా అమెరికాలో హాయిగా బ్రతకొచ్చు... ఇంతలోనే అక్కడే ఉన్న నల్లజాతీయులపై దాడులు... ఈ సంగతులు కూడా కాసేపు పక్కనపెడితే... తాజాగా జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అమెరికా ప్రజల ఆలోచన స్థాయి ఎంత చీప్ గా ఉంటుందో ఇట్టే అర్ధమైపోతుంది. ఈ విషయం తెలిస్తే... ఇకపై అమెరికాను చూసి నేర్చుకోండిరా అనే మాటలు వినిపించకపోవచ్చు.

అబ్బో వారిది మామూలు క్రమశిక్షణ కాదండి - రోడ్డుపై కరెక్టుగా ప్రయాణిస్తారు - రూల్స్ కరెక్టుగా ఫాలో అవుతారు, టాక్సులు కరెక్టుగ పే చేసేస్తారు. వాటిని ఎవరూ చూసిందీ లేదు చేసిందీ లేదు. ఆ సంగతి అలా ఉంచితే అమెరికా అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికల తంతుతో ప్రపంచానికి అమెరికాపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు డోనాల్డ్‌ ట్రంప్‌ ని అధ్యక్ష బరిలో నిలబెడితే - డెమోక్రాట్లు హిల్లరీ క్లింటన్  ని బరిలో నిలబెట్టారు. దీంతో వీరి ప్రచార హోరు రసవత్తరంగానే కాదు, అత్యంత దారుణంగా కూడా జరుగుతోంది. అందుకు బలమైన సాక్ష్యం వీరిద్దరి నగ్న విగ్రహాల్నీ కొందరు అమెరికా రోడ్లపై నిస్సిగ్గుగా నిలబెట్టేశారు.

కొన్ని రోజుల క్రితం ట్రంప్‌ నగ్న విగ్రహం రాత్రికి రాత్రే నడిరోడ్డుపై వెలిసింది. అది హిల్లరీ మద్దతుదారుల పనేనని ట్రంప్‌ అండ్ కో విమర్శించారు. సరేలే వారు చేస్తే లేనిది తాము చేస్తే వచ్చిందా అనుకున్నారో లేక మరెవరో చేసినపనో కానీ ఇప్పుడు హిల్లరీ క్లింటన్‌ నగ్న విగ్రహం వెలుగు చూసింది. వెంటనే స్పందించిన డెమోక్రాట్లు ఇది ట్రంప్‌ పనేనని అనకుండా ఉండే చాన్సే లేదు!! ఈ స్థాయిలో దిగజారిపోయింది అమెరికా ఎన్నికల ప్రచారం. ఈ విగ్రహాలను ఎవరు నిలబెట్టారు అనేదానికన్నా... అమెరికానే ప్రపంచం ముందు నగ్నంగా నిలబెట్టారనే విమర్శలు మొదలైపోయాయి.

అమెరికా అధ్యక్షుడంటే ఆ గొప్పతనం ఉండాల్సింది కేవలం వారు విహరించే ప్రత్యేక విమానాల్లోనీ, నివసించే శ్వేత సౌధాల్లోనే, ప్రయాణించే కార్లలోనే కాదు కదా... ఇప్పుడు బరిలో ఉన్న వారిలో ఏ ఒక్కరూ ఈ తక్కువని, ఎక్కువనీ చెప్పలేని పరిస్థితి సామాన్యుడిది. రేపు కచ్చితంగా వీరిలో ఒకరు అమెరికా అధ్యక్ష స్థానంలో కుర్చుంటారు. అంతమాత్రాన్న ఈ న్యూడ్‌ విగ్రహాల వ్యవహారాన్ని ప్రపంచం మరిచిపోతుందా? ఆయా వ్యక్తుల కీర్తి ప్రతిష్టల్ని దెబ్బతీయకుండా ఉంటుందా? ఈ విగ్రహాలు ఏర్పరచినవారూ, ఏర్పరచమన్నవారు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఇక్కడ దాగుంది... వారు అప్రతిష్టపాలు చేసింది తమ ప్రత్యర్ధులను కాదు అమెరికా అధ్యక్ష పీఠాన్ని.. ఈ విషయం అగ్రరాజ్యంలోని ఈ స్థాయి మనస్థత్వం ఉన్న ప్రజలు గ్రహిస్తారా?.. గ్రహించాలని పలురువు ఆశిస్తున్నారు!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News