బన్నీకి మళ్లీ పోలీసుల నోటీసులు.. ఈసారి ఏం చెప్పారంటే?
ఈ నేపథ్యంలో బన్నీకి రాంగోపాల్ పేట్ పోలీసులు ఇప్పటికే ఓ సారి నోటీసులు ఇవ్వగా.. ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్స్ సమయంలో తొక్కిసలాట జరగడం.. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడం.. బన్నీని సడెన్ గా అరెస్ట్ చేయడం.. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన బయటకు రావడం.. రీసెంట్ గా నాంపల్లి కోర్టు నుంచి రెగ్యులర్ బెయిల్ పొందడం.. ఇవన్నీ తెలిసిందే.
అయితే తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. వైద్యులు ఆ బాలుడికి అన్ని విధాలుగా మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తోందనే చెప్పాలి.
ఇక సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు పరామర్శించారు. తాము ప్రకటించిన పరిహారాన్ని చెక్స్ రూపంలో శ్రేతేజ్ తండ్రికి అందించారు. అందులో మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని- రవిశంకర్ యలమంచిలి సుకుమార్, అల్లు అరవింద్ సహా పలువురు ఉన్నారు.
అయితే కొన్ని కారణాల వల్ల ఆస్పత్రికి వెళ్లని అల్లు అర్జున్.. ఈ మధ్య వెళ్లి బాలుడిని పరామర్శిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బన్నీకి రాంగోపాల్ పోలీసులు పేట్ ఇప్పటికే ఓ సారి నోటీసులు ఇవ్వగా.. ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేశారు. కిమ్స్ కు ఎప్పుడు రావాలనుకున్నా తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లి అల్లు అర్జున్ మేనేజర్ కరుణాకర్ కు నోటీసులు అందజేశారు పోలీసులు. అయితే ఆదివారం ఇచ్చిన నోటీసుల్లో బన్నీని ఆస్పత్రికి రావొద్దని సూచించారు. నాంపల్లి కోర్టు విధించిన బెయిల్ షరతులను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఒకవేళ పరామర్శకు వస్తే తమ సూచనలు పాటించాలని చెప్పారు.
అలా కాకుండా వస్తే.. అక్కడ ఏం జరిగినా అల్లు అర్జున్ పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు బన్నీ వెళ్తారని ఎక్కడా ఎవరు చెప్పలేదు. వార్తలు మాత్రమే వస్తున్నాయి. ఇంతలో పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. మరి నిజంగా ఆస్పత్రికి అల్లు అర్జున్ వెళ్తారో లేదో వేచి చూడాలి.