షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు...విచారణ తేదీ కన్ ఫాం!

Update: 2023-06-05 14:10 GMT
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఏ చిన్న విషయం జరిగినా అది వైరల్ అయిపోతుంది. అందులో ఉన్న రాజకీయ కారణాలను వెతికే పనిలో చాలా మందిని బిజీ చేసేస్తుంది. అయితే తాజాగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా తాజాగా ఆమెకు నాంపల్లి కోర్టు సమన్లు జారీచేసింది.

అవును... పోలీసులపై దాడి కేసులో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ కి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 20వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో షర్మిళ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

కొన్ని రోజుల క్రితం “టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ” వ్యావహారంపై పోరాడుతున్న షర్మిల.. దీనికి సంబంధించి వినతిపత్రం ఇవ్వడానికి టీఎస్పీఎస్సీ బోర్డు కార్యాలయానికి వెళుతుండగా పోలీసులు లోటస్ పాండ్‌ లోని ఆమె నివాసం వద్ద అడ్డుకున్న విషయం తెలిసిందే. అనవసరంగా తనను అడ్డుకుంటున్నారంటూ నాడు షర్మిళ పోలీసులతో వాగ్వానికి దిగారు.

ప్రజాసమస్యలపై పోరాడుతున్న తనను ఎందుకు ఆపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆమె రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో చివరికి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ కు తరలించారు.

అయితే అరెస్టు సమయంలో నాడు జరిగిన హై డ్రామాలో షర్మిల ఓ మహిళా కానిస్టేబుల్‌ పై చెయ్యి చేసుకున్నారు.. కావాలనే చేయి చేసుకున్నారా.. లేక, ఆ ఆవేశంలో, ఒత్తిడిలో అసంకల్పితంగా జరిగిపోయిందా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... నాడు ఆ దశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

ఈ దాడి ఘటనను సీరియస్‌ గా తీసుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మరుసటి రోజు షర్మిల బెయిల్‌ పై విడుదలై బయటకు వచ్చారు.

అందులో భాగంగా ఈరోజు పోలీసులు ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేశారు. దీంతో విచారణకు హాజరుకావాలంటూ షర్మిలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మరి ఈనెల 20వ తేదీన షర్మిళ విచారణకు హాజరవుతారా.. లేదా.. అనేది వేచి చూడాలి.

Similar News