బాలయ్య ‘ఎన్టీఆర్’ అసంతృప్తి పోవాలంటే..?

Update: 2016-01-18 09:01 GMT
సంక్రాంతి పండగ వెళ్లిన వెంటనే వచ్చే పెద్ద కార్యక్రమం ఏదైనా ఉందంటే.. అది తెలుగోడి గుండెల్లో తన ముద్రేసి వెళ్లిపోయిన ఎన్టీవోడి వర్థంతి. జనవరి 18న ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలే కాదు.. నాటికి నేటికి ఎన్టీఆర్ ను అభిమానించే వారంతా ఒక్కసారిగా ఆయన స్మృతుల్లోకి జారి పోయే పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాన్ని హైదరాబాద్ లో భారీగా నిర్వహించేవారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా.. ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాల్లో భారీతనం మిస్ కాకుండా చూసుకునేవారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో ఎన్టీఆర్ ఊసు కాస్త తగ్గింది. ఈసారి మరికాస్త తగ్గింది. ఈ విషయాన్ని గుర్తించిన బాలకృష్ణ తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు.  బాలకృష్ణతో పాటు.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన వ్యక్తి మరొకరు ఉన్నారు. ఆమే.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ ను పట్టించుకోవాలంటూ ఆమె.. ఏపీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులను కోరారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ వర్థంతి రోజున పలు కార్యక్రమాల్ని హైదరాబాద్ లో నిర్వహించే వారు. అయితే.. ఇప్పుడు అలాంటివి పెద్దగా కనిపించని పరిస్థితి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఘాట్ వద్దకు వెళ్లి నివాళులు అర్పించటం మినహా.. హైదరాబాద్ లో పెద్దగా కార్యక్రమాలు నిర్వహించింది లేదు. తెలంగాణ తెలుగుదేశం నేతలు ఎవరూ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి.. నివాళులు అర్పించిన దాఖలాలు కనిపించకపోవటంపై ఎన్టీఆర్ ను అమితంగా ఆరాధించే పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని పటేల్ పట్వారీ వ్యవస్థను పోయేందుకు ఎన్టీఆర్ చేసిన కృషిని మర్చిపోలేనిది. అయితే.. విపరీతమైన భావోద్వేగాల మధ్య నడిచిన తెలంగాణ ఉద్యమం కారణంగా.. ప్రతిఒక్కరి మూలాల్ని చూసే ధోరణి పెరిగిపోవటంతో.. ఎన్టీఆర్ మాటను ఎత్తేందుకు పలువురు తెలంగాణ నేతలు వెనుకాడుతున్న పరిస్థితి.

ఇలాంటి ధోరణి మరిన్ని రోజులు కొనసాగితే.. తెలంగాణ గడ్డ మీద ఎన్టీఆర్ మాట అన్నదే లేకుండా పోతుందన్న భావన వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితి ఎన్టీవోడిని అమితంగా ఆరాధించే వారికి మింగుడుపడని వ్యవహారమే. వ్యక్తులను ప్రాంతాల వారీగా చూసే కన్నా.. వారు చేసిన సేవల్ని ప్రాతిపదికగా తీసుకొని తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాంతాలుగా విడిపోయిన తెలుగు వారు.. విడిపోయిన తర్వాత  కూడా కలిసి ఉండాలన్న నినాదం నిజమే అయితే.. ఆయా ప్రాంతాలకు చేసిన ‘‘తెలుగోళ్లను’’ అన్ని ప్రాంతాల వారు గుర్తు పెట్టుకొని గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే జరిగితే.. బాలకృష్ణ.. లక్ష్మీ పార్వతిలకు మాత్రమే కాదు ఎన్టీవోడిని అభిమానించే ఎవరూ అసంతృప్తి చెందాల్సిన అవసరం ఉండదు.
Tags:    

Similar News